కౌంటర్‌ దాఖలుకు 4 వారాల గడువివ్వండి

కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌... బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ను (కేడబ్ల్యూడీటీ-2) కోరింది.

Published : 30 Jun 2024 04:54 IST

కృష్ణా జలాల పునః పంపిణీ కేసులో ట్రైబ్యునల్‌ను కోరిన ఏపీ 

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల పునః పంపిణీకి సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌... బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ను (కేడబ్ల్యూడీటీ-2) కోరింది. ట్రైబ్యునల్‌ రిజిస్ట్రార్‌కు శుక్రవారం లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణా జలాలు, పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాల్లో 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పునః పంపిణీ చేపట్టేందుకు కేడబ్ల్యూడీటీ-2కు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం నూతన విధి విధానాలను (టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) నిర్దేశించింది. దీనిలో భాగంగా విచారణ ప్రారంభించిన ట్రైబ్యునల్‌ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ (ఎస్‌వోసీ) దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఈ ఏడాది ఆరంభంలో ఆదేశించింది. రాష్ట్రాలు దాఖలు చేసిన ఎస్‌వోసీలపై ఈ ఏడాది మే 15న దిల్లీలోని ట్రైబ్యునల్‌ వద్ద విచారణ సాగింది. ఈ సందర్భంగా ఎస్‌వోసీలపై జూన్‌ 11 లోపు కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ఆదేశించారు. వాటిపై జులై 15, 16వ తేదీల్లో విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ దాఖలు చేసిన ఎస్‌వోసీపై తెలంగాణ.. కౌంటర్‌ అఫిడవిట్, స్టేట్‌మెంట్‌ దాఖలు చేసింది. ఏపీలో ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రం తెలంగాణ ఎస్‌వోసీపై కౌంటర్‌ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో విచారణ వాయిదా కోరుతూ ఏపీ  ట్రైబ్యునల్‌ను అభ్యర్థించింది. కౌంటర్‌ దాఖలుకు నాలుగు వారాల గడువు కోరింది. ట్రైబ్యునల్‌ ఇందుకు సమ్మతించింది. తదుపరి విచారణ తేదీలను ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు