గోదాముల్లో.. సమిధలు!

సికింద్రాబాద్‌ బోయిగూడలోని తుక్కు గోదాములో 2022 మార్చి 22న 11 మంది మంటల్లో మసయ్యారు.. 2023 నవంబరు 13న హైదరాబాద్‌ బజార్‌ఘాట్‌లో రసాయన గోదాములో జరిగిన పేలుడులో 9 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు...

Published : 30 Jun 2024 04:53 IST

10 ఏళ్లలో 552 మంది సజీవదహనం
మృతుల్లో ఎక్కువ మంది పరిశ్రమల్లోని కార్మికులే 
వలస కూలీల కుటుంబాల్లో  తీరని విషాదం
ఈనాడు, హైదరాబాద్‌ 

సికింద్రాబాద్‌ బోయిగూడలోని తుక్కు గోదాములో 2022 మార్చి 22న 11 మంది మంటల్లో మసయ్యారు.. 2023 నవంబరు 13న హైదరాబాద్‌ బజార్‌ఘాట్‌లో రసాయన గోదాములో జరిగిన పేలుడులో 9 మంది అగ్నికీలలకు ఆహుతయ్యారు... 2024 ఏప్రిల్‌ 3న సంగారెడ్డి ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో రియాక్టర్లు పేలి డైరెక్టర్‌ సహా ఆరుగురు బిహారీ కూలీలు సజీవ దహనమయ్యారు... తాజాగా శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని బూర్గులలో ఉన్న గ్లాస్‌ పరిశ్రమలో జరిగిన పేలుడులో అయిదుగురు ఉత్తరాది కూలీలు దుర్మరణంపాలయ్యారు. ఇలా తరచూ చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు విషాదాంతాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా వలస కూలీల ప్రాణాలు మంటల్లో మాడి మసై పోతున్నాయి. అగ్ని ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాల్లో సరైన జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం, నిబంధనలు పాటించకపోవడం శాపంగా మారుతోంది. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ప్రమాదం సంభవించినప్పుడు బయటపడేందుకు అనువైన మార్గాలులేకపోవడంతో తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రమాదకర ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నా వాటిలో సరైన జాగ్రత్తలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా షాద్‌నగర్‌లో చోటు చేసుకున్న విషాదాంతం మరోసారి భద్రతాచర్యల్లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఈ తరహా ప్రమాదాల్లో ఎక్కువగా మృత్యువాత పడుతున్నది ఉత్తరాది కార్మికులే. చిన్నతరహా పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసేందుకు పొట్ట చేత పట్టుకొని వస్తున్న ఇలాంటివారి కోసం యాజమాన్యాలు సమీపంలోని గోదాముల్లోనే వసతి కల్పిస్తున్నాయి. పగలంతా పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు రాత్రివేళ అక్కడే ఉంటున్నారు. సాధారణంగా ఇలాంటి గోదాములు ఇరుకుగా ఉంటాయి. గాలి వెలుతురు సక్రమంగా రాదు. దీంతో ప్రమాదం సంభవించిన వెంటనే పొగతో ఊపిరాడని పరిస్థితులు నెలకొంటున్నాయి. 2014-23 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 552 మంది అగ్నిప్రమాదాలకు ఆహుతయ్యారు. 

నిబంధనలు పాటించేవి ఎన్ని?

అగ్నిమాపక సేవల చట్టం ప్రకారం విద్యాసంస్థలు, ఫంక్షన్‌హాళ్లు, సినిమా థియేటర్లు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో సకల జాగ్రత్తలు తీసుకోవాలి,. 2006 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. మిగిలిన వాటిలో 15 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ ఉన్న భవనాలు అగ్నిమాపకశాఖ పరిధిలోకి వస్తాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి.. లాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలతోపాటు వాటికి అనుబంధంగా గోదాములున్నాయి. పరిశ్రమల్లో అగ్నిమాపక పరికరాలున్నా గోదాముల్లో మాత్రం వాటిని నిర్వహించడం లేదు. వీటిలో పరికరాల ఏర్పాటుకు అగ్నిమాపక శాఖ ప్రతిపాదనలు ఇప్పటివరకు కార్యరూపం దాల్చడంలేదు. ఫలితంగా తరచూ అగ్నిప్రమాదాల్లో కూలీలే సమిధలవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని