మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌ హఠాన్మరణం

భాజపా నేత, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌(57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Published : 30 Jun 2024 04:51 IST

ఉన్నట్టుండి అస్వస్థతకు గురై కన్నుమూత

ఉట్నూరు, న్యూస్‌టుడే: భాజపా నేత, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌(57) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం ఒక్కసారిగా రక్తపోటు పడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గంమధ్యలో ఇచ్చోడ వద్ద మధ్యాహ్నం 12.20 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అంచెలంచెలుగా ఎదిగి..

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూర్‌కు చెందిన రమేశ్‌ రాఠోడ్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన 1988లో తెదేపాలో చేరారు. 1995లో నార్నూరు జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 1999లో ఖానాపూర్‌ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ పదవి చేపట్టారు. 2009లో ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచారు. 2018లో తెరాస(ప్రస్తుత భారాస)లో చేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌లో భాజపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి. ఓటమి పాలయ్యారు. రమేశ్‌కు భార్య సుమన్‌ రాఠోడ్‌ (మాజీ ఎమ్మెల్యే), కుమారులు రితేశ్‌ రాఠోడ్, రాహుల్‌ రాఠోడ్, కుమార్తె సొనాలి ఉన్నారు. ఆయన పార్థివదేహానికి బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఉట్నూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేశ్‌ రాఠోడ్‌ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమేశ్‌ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంతాపం ప్రకటించారు.

తెలంగాణకు చెందిన ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. తెదేపాతో రమేష్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్‌ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్, ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా గిరిజన ప్రజలకు ఆయన విశేష సేవలు అందించారని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని