‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా.. శిక్షణ దశలోనే 2024 బ్యాచ్‌ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులు సేవాబాట పట్టి ఆదర్శంగా నిలిచారు.

Updated : 30 Jun 2024 07:39 IST

తెలుగు రాష్ట్రాల్లో అవగాహనకు నిర్ణయం
ఖాతాలు ప్రారంభించి.. వెయ్యి చొప్పున జమ

బాలికకు సుకన్య సమృద్ధి యోజన పాస్‌పుస్తకం అందిస్తున్న చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ టీఎం శ్రీలత, ట్రైనీ ఐఏఎస్‌లు అనన్యారెడ్డి, కిరణ్‌ తదితరులు 

ఈనాడు, హైదరాబాద్‌: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా.. శిక్షణ దశలోనే 2024 బ్యాచ్‌ అఖిల భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులు సేవాబాట పట్టి ఆదర్శంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలందరినీ ‘బాలికా సుకన్య సమృద్ధి యోజన’లో చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించారు. అందుకు బాటలు వేస్తూ.. 65 మంది శిక్షణ అధికారులు తమకు వచ్చిన రూ.1.30 లక్షల రవాణా భత్యంతో.. హైదరాబాద్‌లో 100 మంది బాలికల పేరుతో ఖాతాలు తెరిపించి రూ.వెయ్యి చొప్పున జమ చేశారు. ఇకపై బాలికల తల్లిదండ్రులు నెలవారీ నగదు జమ చేసేందుకు తపాలా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా వారి పేరుతో ఐపీపీబీ (ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌) ఖాతాలు తెరిచి డెబిట్‌ కార్డులు సైతం అందించారు. 

శిక్షణ పొందుతున్న సివిల్‌ సర్వీస్‌ అధికారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 65 మంది కొద్దిరోజుల క్రితం కలుసుకున్నారు. బాలికలు, మహిళల అభ్యున్నతి కోసం శిక్షణ సమయంలోనే ఏదైనా చేయాలని చర్చించుకున్నారు. సివిల్స్‌ తుది ఫలితాల్లో మూడో ర్యాంకు సాధించిన అనన్యారెడ్డి సుకన్య సమృద్ధి యోజనపై అవగాహన కల్పిద్దామని సూచించగా అందరూ ఆమోదించారు. తర్వాత హైదరాబాద్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ శ్రీలతను కలిసి తమ ఆలోచనను వివరించారు. ఆమెతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని జామై ఉస్మానియా తపాలాశాఖ కార్యాలయంలో ఈ నెల 22న 100 మంది బాలికల పేరుతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచి, తల్లిదండ్రులకు అందించారు.  

ఆర్థికాభివృద్ధి ఇలా..

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ఈ పొదుపు పథకంలో పదేళ్లలోపు వయసున్న బాలికలందరూ చేరడానికి అర్హులు. తపాలా కార్యాలయంలో బాలిక పేరుమీద ఖాతా తెరిచి ఏడాదికి కనిష్ఠంగా రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షలు డిపాజిట్‌ చేయవచ్చు. పదిహేనేళ్లు క్రమం తప్పకుండా మదుపు చేయాలి. ఆ తర్వాత మూడేళ్లకు ఈ పథకం గడువు పూర్తవుతుంది. అనంతరం వడ్డీతో సహా మొత్తం నగదును బాలిక పేరుతో తపాలాశాఖ అందజేస్తుంది. నెలకు రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తే 18 ఏళ్లకు రూ.5,39,454; రూ.1500 పొదుపు చేస్తే రూ.8,09,166, రూ.పది వేల చొప్పున పొదుపు చేస్తే రూ.53,94,492 మొత్తం అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని