సంక్షిప్త వార్తలు (8)

షాద్‌నగర్‌ సౌత్‌గ్లాస్‌ ప్రైవేటు కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated : 30 Jun 2024 06:00 IST

మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: సీపీఎం

ఈనాడు, హైదరాబాద్‌: షాద్‌నగర్‌ సౌత్‌గ్లాస్‌ ప్రైవేటు కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


జులై 31 వరకు ఇంటర్‌  ప్రవేశాల గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని రకాల కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు గడువును జులై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.


డీఓపీటీ కార్యదర్శిగా అజయ్‌ భల్లాకు అదనపు బాధ్యతలు

మైనార్టీ కమిషన్‌ కార్యదర్శిగా కె.శ్రీనివాస్‌

ఈనాడు, దిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లాకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ(డీఓపీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ శాఖ కార్యదర్శిగా ఉన్న రాధాచౌహాన్‌ ఆదివారం పదవీ విరమణ చేస్తుండటంతో అజయ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బాధ్యతలను ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్డాకు అదనంగా అప్పగించారు. వ్యవసాయశాఖకు తదుపరి కార్యదర్శి నియమితులయ్యే వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.  జాతీయ మైనార్టీల కమిషన్‌ కార్యదర్శిగా కతికితల శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న అంజలి భావ్ర పదవీ విరమణ పొందారు. 


ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తృతంగా వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో శనివారం 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిశాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరిమెరిలో 5.3, జైనూరు 4.9, నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి 4.6, వరంగల్‌ జిల్లా ఖానాపూర్‌ 4.5 సెం.మీ. వర్షం కురిసింది.మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 


ఏపీలో జులై 1 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ 

ఈనాడు, అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కన్వీనర్‌ నవ్య శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఐచ్ఛికాల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 


కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా అతుల్‌ జైన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా అతుల్‌ జైన్‌ను నియమిస్తూ కేంద్ర జలశక్తిశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జల సంఘంలో పనిచేస్తున్న జైన్‌కు పదోన్నతి కల్పించి.. బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న శివ్‌ నందన్‌ కుమార్‌ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు.


విద్యుత్‌పై విచారణ కమిషన్‌ గడువు పొడిగింపు!

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌పై జస్టిస్‌ నరసింహారెడ్డి ఛైర్మన్‌గా ఉన్న విచారణ కమిషన్‌ గడువును మరో నెల రోజులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్‌ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించిన గడువు నేటి(ఈ నెల 30)తో ముగియనుండగా విచారణ పూర్తికానందున గడువును పొడిగించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ఇంధనశాఖ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. నేడో, రేపో ఉత్తర్వులు జారీకానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 


నీట్‌ రద్దు కోరుతూ రేపు ‘చలో రాజ్‌భవన్‌’

విద్యార్థి, యువజన సంఘాల ఐకాస పిలుపు

నల్లకుంట, న్యూస్‌టుడే: నీట్‌లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో.. సంబంధిత ఫలితాలను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా జులై 1న ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మార్క్స్‌ భవన్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేశ్‌ అధ్యక్షతన జరిగిన ఐకాస నేతల సమావేశంలో ఎస్వీ శ్రీకాంత్‌(పీడీఎస్‌యూ), విష్ణువర్ధన్‌రెడ్డి(ఎన్‌ఎస్‌యూఐ), రజనీకాంత్‌(ఎస్‌ఎఫ్‌ఐ), అరుణ్‌(వీజేఎస్‌), ఆజాద్‌(పీడీఎస్‌యూ), జావీద్‌(డీవైఎఫ్‌ఐ), శ్రీకాంత్‌(ఏఐవైఎఫ్‌), సాగర్, ప్రదీప్‌(పీవైఎల్‌), సలీం(వైజేఎస్‌) తదితర నేతలు మాట్లాడారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించి తరచూ పేపర్‌ లీకేజీ అవుతున్నా.. నిందితులపై కఠిన చర్యలు చేపట్టడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. నీట్‌ను తిరిగి నిర్వహించకపోతే ఆందోళనలనూ తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని