ఇక భూ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం

ధరణి పోర్టల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ జిల్లా కలెక్టర్లకు తెలిపారు.

Published : 30 Jun 2024 04:43 IST

పలు జిల్లాల కలెక్టర్లపై సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ ఆగ్రహం 
పలువురు ఆర్డీవోల పని తీరుపైనా అసంతృప్తి
సీఎమ్మార్వో డేటా ఆధారంగా ధరణి దరఖాస్తులపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. లక్ష్యం మేరకు పరిష్కారాలు చూపకపోతే చర్యలు కూడా చేపట్టనున్నట్లు స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్‌ఏ జిల్లాల కలెక్టర్లతో రెండు దశల్లో వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈనెల 14వ తేదీన నిర్వహించిన సమీక్ష తరువాత జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను ఏ మేరకు చేరుకున్నారనే దానిపైనా ఒక్కో జిల్లా వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ దస్త్రాల కంప్యూటరీకరణ-నిర్వహణ ప్రాజెక్టు (సీఎమ్మార్వో) విభాగం తొలిసారిగా పెండింగ్‌ సమస్యల చిట్టాను ప్రత్యేకంగా రూపొందించింది. జిల్లాల వారీగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్ల వారీగా లాగిన్లలో ఉన్న అపరిష్కృత దరఖాస్తుల వివరాలను సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.లచ్చిరెడ్డి సీసీఎల్‌ఏకు అందజేశారు. ఈ డేటా అధారంగా అధికారుల పనితీరును నవీన్‌మిత్తల్‌ సమీక్షించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ధరణి పెండింగ్‌ దరఖాస్తులు 2.34 లక్షలు ఉండగా కొన్ని జిల్లాల కలెక్టర్లు పరిష్కారాలు చూపడంలో నిర్లక్ష్యం వహించారంటూ సీసీఎల్‌ఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం  ఈ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య పలు జిల్లాల కలెక్టర్లు చాలా తక్కువ సంఖ్యలో పరిష్కరించిన తీరును గణాంకాలతో వివరించారు. 32 జిల్లాల్లో 24,778 మాత్రమే పరిష్కరించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో పరిష్కారాలు వేగంగా జరగడం లేదని తెలిపారు. దీంతోపాటు కొన్ని జిల్లాల్లో ఆర్డీవోలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సులువుగా పరిష్కరించే వీలున్న పెండింగ్‌ మ్యుటేషన్ల విషయంలో ఆర్డీవోలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరును గణాంకాలతో వివరించి తప్పుపట్టారు. జిల్లాల వారీగా పెండింగ్‌ వివరాలను ఏ రోజుకారోజు వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తున్నామని వేగవంతంగా పరిష్కారాలు చూపి భూ యజమానుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమీక్షలో పలు సూచనలు చేశారు. జిల్లాల నుంచి కూడా పలు రకాల సమస్యలను రెవెన్యూ యంత్రాంగం వివరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని