పీసీసీఎఫ్‌ వేధింపుల నుంచి రక్షించండి

అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ శాఖాపరమైన వేధింపుల నుంచి తనను రక్షించాలని, చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ డి.జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 30 Jun 2024 04:42 IST

62 నెలలుగా వేతనం లేదు
అటవీశాఖ ముఖ్యకార్యదర్శికి.. సూపరింటెండెంట్‌ జయలక్ష్మి విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ శాఖాపరమైన వేధింపుల నుంచి తనను రక్షించాలని, చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ డి.జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 62 నెలలుగా వేతనం లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌ ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మౌఖికంగా వివరించడంతోపాటు ఏడు పేజీల లేఖనూ అందించారు. జయలక్ష్మి గత నెలలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ అటవీశాఖ అదనపు కార్యదర్శి నుంచి లేఖ రావడంతో ఆమె ముఖ్యకార్యదర్శిని కలిశారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ విచారణ జరిగింది. 

ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చానని కక్ష

‘నేను నిజామాబాద్‌ సర్కిల్‌ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఓ క్వారీకి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తుదారుకు ఇచ్చాను. అప్పటి శాఖాధిపతి, అదనపు పీసీసీఎఫ్‌గా ఉన్న ప్రస్తుత పీసీసీఎఫ్‌ నాపై కక్ష పెంచుకున్నారు. మరో అధికారి ద్వారా నాపై కేసులు పెట్టించారు. విచారణాధికారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డోబ్రియాల్‌నే పంపారు. అప్పటి నుంచి ఆయన విచారణ పేరుతో నన్ను వేధిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్లకు, అప్పటి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు చేశాను. కానీ తన పలుకుబడి ఉపయోగించి వాటిని బుట్టదాఖలు చేయించారు. మహిళా అధికారిణి లేకుండానే విచారణ పూర్తి చేయించారు. చివరికి డోబ్రియాల్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే నాకు మెమో, ఛార్జిషీట్‌ ఇచ్చారు’ అంటూ జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదును పరిశీలించి విచారిస్తానని అహ్మద్‌ నదీమ్‌ పేర్కొన్నారు. 2022 జనవరిలో తాను వీఆర్‌ఎస్‌కు చేసుకున్న దరఖాస్తును 2023 నవంబరులో తిరస్కరించి భువనగిరిలో పోస్టింగ్‌ ఇచ్చారని, కానీ కాలి గాయం సమస్యతో కొంత సమయం కోరానని జయలక్ష్మి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తనపై విధించిన పనిష్మెంట్‌ను రద్దు చేయాలని, ఇంకా మూడేళ్ల సర్వీసు ఉన్నందున పీసీసీఎఫ్‌ ప్రభావం లేనిచోట పోస్టింగ్‌ ఇవ్వాలని కోరారు. మీ పరిధిలో పోస్టింగ్‌ ఇచ్చినా విధులు నిర్వర్తిస్తానని ముఖ్య కార్యదర్శికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని