బీటీపీఎస్‌లో భారీ అగ్ని ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్‌)లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Published : 30 Jun 2024 04:40 IST

బీటీపీఎస్‌లో చెలరేగుతున్న మంటలు

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(బీటీపీఎస్‌)లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీటీపీఎస్‌లోని మొదటి యూనిట్‌కు చెందిన జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌(జీటీ)కు మంటలు వ్యాపించాయి. మొదటి యూనిట్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్తును జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా స్విచ్‌ యార్డ్‌కు పంపిస్తారు. అగ్నిప్రమాదంతో ముందస్తుగా మొదటి, రెండో యూనిట్లను షట్‌డౌన్‌ చేశారు. జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు అంటుకున్న మంటల్ని అదుపు చేయడం ఫైర్‌ ఇంజిన్ల వల్ల సాధ్యం కాకపోవటంతో.. ఫోం కెమికల్‌ను వినియోగించారు. సుమారు గంటన్నరపాటు అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి.. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. జీటీకి మంటలు వ్యాపించిన సమయంలో అక్కడ కార్మికులు, ఉద్యోగులు, ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవటంతో రూ.కోట్లలో నష్టం ఉంటుందని అంచనా. ఘటనపై సీఈ బిచ్చన్నను వివరణ కోరగా.. అగ్నిప్రమాదానికి కారణాలేమిటో విశ్లేషిస్తున్నామని, పిడుగుపాటా లేదా సాంకేతిక లోపమా అన్నది తేలాల్సి ఉందన్నారు. సమగ్ర పరిశీలన తర్వాత ఆదివారం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. బీటీపీఎస్‌లో ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. సీఈ బిచ్చన్నతో సెల్‌ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని