వైద్య పర్యాటక కేంద్రంగా తెలంగాణ

రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్‌ ప్రొఫైల్‌ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 30 Jun 2024 04:37 IST

ప్రతి పౌరుడికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు
మెడికవర్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

మెడికవర్‌ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ అనిల్‌కృష్ణ, డాక్టర్‌ శరత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హరికృష్ణ తదితరులు

ఈనాడు- వరంగల్‌: రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్‌ ప్రొఫైల్‌ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, తెలంగాణను వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలో ‘మెడికవర్‌’ ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఇతర మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్యం, విద్యుత్తు అందుబాటులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, ఫార్మా రంగంపై ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్‌కు స్థానం ఉంటుందని.. ఇందుకు ఇందిరాగాంధీ దూరదృష్టి కారణమని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించిందని అన్నారు. శంషాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో మెడికల్‌ టూరిజం హబ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ఈ హబ్‌లో అన్ని రకాల వైద్యసేవలు అందించాలని, రాష్ట్రంలో పేదలందరికీ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు. వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు త్వరలో విమానాశ్రయం రాబోతోందని రేవంత్‌ తెలిపారు. ఆసుపత్రి సీఎండీ డాక్టర్‌ అనిల్‌కృష్ణ, నిర్వాహకులు డాక్టర్‌ ఎ.శరత్‌రెడ్డి, పి.హరికృష్ణలు మాట్లాడుతూ.. 300 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశామంటూ ప్రత్యేకతలను వివరించారు.

దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచారు: సీఎం రేవంత్‌ 

ఈనాడు, హైదరాబాద్‌ : ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు. ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుతంగా ఆడింది. ఈ విజయంతో దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపజేశారు. క్రికెట్‌ ప్రపంచంలో భారత్‌కు ఎదురులేదని మరోసారి నిరూపించారు.

అద్భుత ప్రదర్శన: మాజీ మంత్రి కేటీఆర్‌ 

ఇది టీం ఇండియా అద్భుత ప్రదర్శన. ప్రపంచకప్‌ను ఇంటికి తీసుకొచ్చిన మెన్‌ ఇన్‌ బ్లూకు అభినందనలు. కీలకమైన ఫైనల్‌లో కోహ్లి సందర్భనుసారం ఆడటంతోపాటు బౌలర్లు కూడా విశేషంగా రాణించారు. కోట్ల హృదయాలను సంతోషంతో నింపిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ప్రత్యేకాభినందనలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని