ఆ బంగారం జప్తు సరైన చర్యే

కస్టమ్స్‌ అధికారులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో గతేడాది ఆగస్టు 12న తమ నుంచి జప్తు చేసిన బంగారాన్ని తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి.

Updated : 30 Jun 2024 05:38 IST

తిరిగి అప్పగించాలన్న పిటిషన్లను కొట్టివేసిన ధర్మాసనం

ఈనాడు, హైదరాబాద్‌: కస్టమ్స్‌ అధికారులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో గతేడాది ఆగస్టు 12న తమ నుంచి జప్తు చేసిన బంగారాన్ని తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన షేక్‌ ఆరిఫ్, షేక్‌ మహమ్మద్‌ సిద్ధిఖీలు వేర్వేరుగా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్‌ సామ్‌కోషి, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు బ్యాంకాక్‌లో చట్టపరంగా బంగారాన్ని కొనుగోలు చేశారని, భారత్‌కు వచ్చాక ఆ వివరాలను కస్టమ్స్‌ అధికారులకు వెల్లడించాలని భావించారని తెలిపారు. ‘‘అయితే విమానాశ్రయంలో డిక్లరేషన్‌ కౌంటర్‌ వద్దకు చేరుకోక ముందే అధికారులు కస్టడీలోకి తీసుకుని బంగారాన్ని జప్తుచేశారు. దీంతో పిటిషనర్లు డిక్లరేషన్‌ ఫాం ఇవ్వడంతోపాటు సుంకం చెల్లించే అవకాశాన్ని కోల్పోయారు. గత ఆగస్టు 24న పిటిషనర్లు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగానే జప్తులో ఉన్న బంగారాన్ని డిస్పోజల్‌ చేస్తున్నట్లు నోటీస్‌ జారీచేశారు. ఇలా నోటీస్‌ ఇవ్వడం కస్టమ్స్‌ చట్టంలోని 150 సెక్షన్‌ ఉల్లంఘన కిందకే వస్తుంది. పిటిషనర్లు సెప్టెంబరు 21న బెయిల్‌పై బయటికి వచ్చిన అనంతరం ఈ రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈక్రమంలో బంగారాన్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలివ్వాలి..’’ అని విజ్ఞప్తి చేశారు.

బ్యాంకాక్‌లో కొనలేదని అంగీకరించారు..

కస్టమ్స్‌ అధికారుల తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ డొమినిక్‌ ఫెర్నాండెజ్‌ వాదనలు వినిపించారు. ‘పిటిషనర్లలో ఒకరు రూ.1.21 కోట్ల విలువైన 2000 గ్రాముల బంగారం.. మరొకరు రూ.1.08 కోట్ల విలువైన 1793.500 గ్రాముల బంగారం తెచ్చారు. బంగారాన్ని నల్లటి టేపుతో చుట్టి ప్యాంట్‌ జేబులో తీసుకొచ్చారు. వాటికి సరైన ఇన్‌వాయిస్‌లు లేవు. సుంకం చెల్లించే ఉద్దేశముంటే రెడ్‌ ఛానల్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాలి. కానీ వారు గ్రీన్‌ ఛానల్‌ కౌంటర్‌ ద్వారా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. బ్యాంకాక్‌లో తాము బంగారం కొనలేదని,  గుర్తుతెలియని వ్యక్తులు అందజేశారని, విమానాశ్రయం బయట అప్పగించాలని చెప్పారని తెలిపారు’’ అని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కస్టమ్స్‌ నిర్ణయం సరైందేనంటూ పిటిషన్లను కొట్టివేసింది. అధికారులు చట్టానికి లోబడి చర్యలు తీసుకున్నారని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు