యుద్ధప్రాతిపదికన జాతీయ రహదారుల భూసేకరణ!

జాతీయ రహదారుల నిర్మాణానికి పీటముడిగా ఉన్న భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రవాణా,

Published : 30 Jun 2024 04:32 IST

జాప్యాన్ని నియంత్రిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ 
రాష్ట్రానికి త్వరలో కేంద్ర బృందం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారుల నిర్మాణానికి పీటముడిగా ఉన్న భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అనుమతులిచ్చినా ఆశించిన స్థాయిలో ముందడుగు పడటం లేదు. భూసేకరణకు అధిక సమయం పడుతుండటంతో నిర్మాణ వ్యయమూ పెరిగిపోతోంది. మరోవైపు సింహభాగం భూసేకరణ పూర్తి చేసిన తరవాతే నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. భూసేకరణ కొలిక్కి రాకుండా శంకుస్థాపన చేసేది లేదని కూడా స్పష్టం చేసింది. సుమారు 949 కి.మీ. మేర 27 రహదారుల ప్రాజెక్టులను కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేసింది. మరో 1,200 కి.మీ.కు సంబంధించిన ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇప్పటికే మంజూరు చేసిన వాటికి జాతీయ రహదారుల హోదాను సైతం కేటాయించింది. భూసేకరణ చేయాల్సిన రెవెన్యూ అధికారులు గడిచిన ఏడాదిగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల క్రతువులో ఉండటంతో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు. దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల వరకు సేకరించాల్సి ఉన్నట్లు అంచనా.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీలో..

రాష్ట్రానికి సంబంధించిన రహదారుల ప్రాజెక్టుల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల దిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అవసరమైన భూమిని త్వరితంగా అప్పగిస్తే ప్రాజెక్టులను వేగంగా చేపడతామని కేంద్ర మంత్రి చెప్పగా... ‘యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపడతామని, లేనిపక్షంలో రహదారుల విషయంపై మరోసారి మీ వద్దకు రాను’ అని సీఎం స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్న ఓ అధికారి ‘ఈనాడు’తో చెప్పారు. ఈ నేపథ్యంలో పెండింగులో ఉన్న జాతీయ రహదారుల వారీగా ఎంత భూసేకరణ చేశారు, ఇంకా ఎంత చేయాలి, ఆలస్యానికి కారణాలు తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై సీఎం త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఇదే విషయంపై సమీక్షించేందుకు కేంద్ర అధికారుల బృందం కూడా త్వరలో రాష్ట్రానికి రానుంది. ఈ సందర్భంగా ప్రాంతీయ రింగు రోడ్డు త్రైపాక్షిక ఒప్పందానికీ తుది రూపు ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని