Secunderabad Cantonment: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనం.. సీఎం రేవంత్‌ చొరవతో అంగీకరించిన కేంద్రం

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని పౌర(సివిలియన్‌) ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Updated : 30 Jun 2024 09:13 IST

పౌరప్రాంతాలను కలపడంపై విధివిధానాల జారీ

ఈనాడు-హైదరాబాద్, కంటోన్మెంట్‌-న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని పౌర(సివిలియన్‌) ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కంటోన్మెంట్‌ బోర్డు విలీనంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కంటోన్మెంట్‌ను విలీనం చేయాలని దిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణశాఖ మంత్రిని కలిసి విన్నవించారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వయంగా విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులన్నిటినీ రద్దు చేసి.. స్థానిక పురపాలక సంఘాలు, నగరపాలికల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధివిధానాలను తాజాగా జారీ చేసింది. వీటి ప్రకారం.. పౌరప్రాంతాలను విలీనం చేస్తారు. ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ జీహెచ్‌ఎంసీకి ఉచితంగా బదిలీ అవుతాయి. ఇప్పటికే లీజుకు ఇచ్చినవి నగరపాలక సంస్థకు బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్‌ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కంటోన్మెంట్‌ బాధ్యులకున్న సందేహాలు నివృత్తి చేసి.. తదుపరి కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ హేమంత్‌ యాదవ్‌ ఈ నెల 28న బోర్డు సీఈవోకు ఉత్తర్వులను జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు