నీట్‌ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి

నీట్‌ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు.

Published : 29 Jun 2024 04:50 IST

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా ఎంపీల ఇళ్ల ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాల  నేతల యత్నం
తీవ్ర ఉద్రిక్తత..ప లువురి అరెస్టు

కిషన్‌రెడ్డి ఇంటి సమీపంలో అరెస్టు చేసినవారిని వాహనాల్లోకి ఎక్కిస్తున్న పోలీసులు

బర్కత్‌పుర, జూబ్లీహిల్స్, మేడ్చల్‌ రూరల్, నల్లకుంట, న్యూస్‌టుడే: నీట్‌ అవకతవకల నేపథ్యంలో సంబంధిత పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. దీనిలో భాగంగా ఐకాస ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా భాజపా ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ నివాసాల ముట్టడికి యత్నించారు. తొలుత శుక్రవారం ఉదయం బర్కత్‌పుర భూమన్నలేన్‌లోని కిషన్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మద్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని కాచిగూడ ఠాణాకు తరలించారు. వారిలో ఎన్‌ఎస్‌యూఐ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అభిజిత్‌యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితీశ్‌రావు, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు లెనిన్‌ తదితరులు ఉన్నారు.


బహిరంగలేఖ ప్రతులు చూపుతున్న బల్మూరి వెంకట్‌ తదితరులు

  • బంజారాహిల్స్‌లోని భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసం ముందు ఎన్‌ఎస్‌యూఐ ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి, నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు.  
  • నీట్‌ పరీక్షను రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్, ప్రధాన కార్యదర్శి రాథోడ్‌ సంతోష్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి రాహుల్‌యాదవ్, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్‌ తదితరులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.

అవకతవకలపై చర్చించేందుకు సమయమివ్వాలి

నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అవకతవకలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు విద్యార్థి, యువజన సంఘాల నేతలు బహిరంగ లేఖ రాశారు. అనంతరం లేఖను మెయిల్‌ ద్వారా ఆయన కార్యాలయానికి పంపించి, ఆ ప్రతులను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌(ఎన్‌ఎస్‌యూఐ), మూర్తి(ఎస్‌ఎఫ్‌ఐ), పెద్దింటి రామకృష్ణ(పీడీఎస్‌యూ), ఎండీ జావీద్‌(డీవైఎఫ్‌ఐ) కల్లూరు ధర్మేంద్ర(ఏఐవైఎఫ్‌), మహేశ్‌(పీడీఎస్‌యూ), కేఎస్‌ ప్రదీప్‌(పీవైఎల్‌) తదితరులు మాట్లాడారు. జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నీట్‌పై ప్రజల్లో నమ్మకం పోయిందని, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరంచేసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నీట్‌ నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని