435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ

రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌లో 431, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం)లో 4 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఆర్‌ఎస్‌బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Published : 29 Jun 2024 04:44 IST

జులై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ
వైద్యారోగ్యశాఖ సేవల నియామక బోర్డు ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 435 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌లో 431, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం)లో 4 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఆర్‌ఎస్‌బీ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన వైద్యులు జులై 2 నుంచి 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మల్టీజోన్‌-1లో 271 పోస్టులు, మల్టీజోన్‌-2లో 164 పోస్టులు ఉన్నాయి. అర్హత పరీక్షలో సాధించిన మార్కులతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులు లేదా వైద్య సంస్థలు, వైద్య కార్యక్రమాల్లో పని చేసిన అనుభవం ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో 6 నెలలు లేదా అంతకంటే విధులు నిర్వహించిన వారికి ప్రభుత్వ సర్వీసు పాయింట్లలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుదారులు ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఉండటంతో పాటు విధిగా తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 46 సంవత్సరాలు కాగా నిబంధనల మేరకు వివిధ వర్గాల వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఇతర వివరాలకు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో ప్రకటనను పరిశీలించాలని సూచించారు. కాగా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది తొలి నోటిఫికేషన్‌ ఇది.

రిజర్వేషన్ల వివరాలు

మొత్తం 435 పోస్టుల్లో జనరల్‌(ఓసీ) కేటగిరీలో 111, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్‌)లో 45, బీసీ(ఏ)లో 30, బీసీ(బీ)42, బీసీ(సీ)4, బీసీ(డీ) 30, బీసీ(ఈ)17, ఎస్సీ 64, ఎస్టీ 44, క్రీడా కేటగిరీలో 8, దివ్యాంగులకు 33, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 7 పోస్టులు రిజర్వు అయినట్లు ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని