రెండోరోజు ఉద్ధృతంగా జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం కొనసాగింది. తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం(టీజూడా) పిలుపు మేరకు ఓఎంసీ(ఉస్మానియా మెడికల్‌ కళాశాల) యూనిట్‌ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు.

Published : 26 Jun 2024 05:28 IST

ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న జూడాలు  

ఉస్మానియా ఆసుపత్రి, సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం కొనసాగింది. తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం(టీజూడా) పిలుపు మేరకు ఓఎంసీ(ఉస్మానియా మెడికల్‌ కళాశాల) యూనిట్‌ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో నిరసన చేపట్టారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలను బహిష్కరించారు. ప్లకార్డులతో బైఠాయించి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా టీజూడా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా.ఇసాక్‌ న్యూటన్, యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు డా.శీసం దీపాంకర్, డా.చంద్రికారెడ్డిలు మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని, ప్రతి నెలా సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు స్పందించడం లేదన్నారు. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వైద్యులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో పోలీసు బందోబస్తు పటిష్ఠం చేయాలని, సీట్లలో ఏపీ విద్యార్థులకు ఇస్తున్న 15 శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో జూడాలు పాల్గొన్నారు. అనంతరం జూడాలు ఉస్మానియా ఆసుపత్రి(ఓజీహెచ్‌)కి చేరుకుని ఆసుపత్రి ఆవరణలో భారీ ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం మానవహారం, పాదయాత్రలతో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు