డ్రగ్స్‌ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించం

మాదకద్రవ్యాల రహిత తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. డ్రగ్స్‌ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించబోమని, ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని పేర్కొన్నారు.

Updated : 26 Jun 2024 05:51 IST

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న భట్టివిక్రమార్క. చిత్రంలో డీజీపీ రవి గుప్తా, సీపీ శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, క్రీడాకారిణి ఇషాసింగ్‌

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాల రహిత తెలంగాణ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. డ్రగ్స్‌ రవాణాలో ఎంతటివారున్నా ఉపేక్షించబోమని, ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ రవాణా చేసేవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ అన్న మాట వినపడకూడదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణకు ఎన్ని నిధులైనా పోలీస్‌ శాఖకు కేటాయించేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. నిందితులు ఎంత దూరం వెళ్లినా పట్టుకునే సామర్థ్యాలు తెలంగాణ పోలీసులకు ఉన్నాయన్నారు. మాదకద్రవ్యాల నివారణకు.. అన్ని గ్రామాల్లోనూ కమిటీలు వేసి సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. అనంతరం నెక్లెస్‌ రోడ్డులో విద్యార్థుల ర్యాలీని ఉప ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల డ్రగ్స్‌కు వ్యతిరేకంగా లఘుచిత్రాలను ఆహ్వానించగా 104 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో మూడు ఉత్తమమైనవి ఎంపిక చేసి.. నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, హైదరాబాద్‌ సీపీ శ్రీనివాసరెడ్డి, క్రీడాకారిణి ఇషాసింగ్, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని