పంచాయతీ భవనాల కోసం రూ.1,544 కోట్లు అవసరం

తెలంగాణలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.1,544 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ను కోరారు.

Published : 26 Jun 2024 05:26 IST

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి సీతక్క వినతి 

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.1,544 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ను కోరారు. ఆమె మంగళవారం ఇక్కడ కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో 6,176 గ్రామపంచాయతీలకు భవనాలు లేవని ఆమె తెలిపారు. ప్రస్తుతం అవన్నీ తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నందున సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ కింద ఈ భవనాల నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణలో పది లక్షల ఇళ్లకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేందుకు నిధులివ్వాలని సీతక్క కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కోరారు. ఆమె మంగళవారం ఆయనను కలిసి రాష్ట్ర అవసరాలను వివరించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 53.98 లక్షల ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించారని, కొత్త ఆవాసాలు, ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం కల్పించడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు