తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అభినందించారు.

Updated : 26 Jun 2024 05:52 IST

కిషన్‌రెడ్డికి కోమటిరెడ్డి, పొంగులేటి విజ్ఞప్తి

కిషన్‌రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న కోమటిరెడ్డి, పొంగులేటి

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అభినందించారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించినట్లు రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ‘ఎక్స్‌’లో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని తాము చేసిన విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. 

రహదారులపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌కు వినతి 

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఛైర్మన్‌ సంతోష్‌కుమార్‌ యాదవ్‌ను కోరారు. ఆయన మంగళవారం దిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవించారు. ‘విజయవాడ-హైదరాబాద్‌ ఎన్‌హెచ్‌ 65ని ఆరు వరుసలుగా విస్తరించాలి. హైదరాబాద్‌-మన్నెగూడ మధ్య ఎన్‌హెచ్‌ 163 పనులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అభ్యంతరాల కారణంగా పెండింగ్‌లో పడ్డాయి. వాటిని వెంటనే పరిష్కరించి నిర్మాణం మొదలుపెట్టాలి. హైదరాబాద్‌-కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్‌ తయారీని వేగవంతం చేయాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. వివిధ రహదారుల మ్యాప్‌లతో కూడిన నివేదికను ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌కు ఇచ్చారు. వీటిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఐ.గణపతిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని