మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి

కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు చట్టబద్ధత కల్పించాలని.. ప్రతి రైతుకు అవి దక్కేలా చూడాలని.. దేశవ్యాప్తంగా పంటల రుణమాఫీని అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు డిమాండ్‌ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

Published : 26 Jun 2024 05:21 IST

దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలి
సంయుక్త కిసాన్‌ మోర్చా నేతల డిమాండ్‌

విలేకరులతో మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు. చిత్రంలో సాగర్, విస్సా కిరణ్‌కుమార్, కన్నెగంటి రవి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు చట్టబద్ధత కల్పించాలని.. ప్రతి రైతుకు అవి దక్కేలా చూడాలని.. దేశవ్యాప్తంగా పంటల రుణమాఫీని అమలు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు డిమాండ్‌ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. హైదరాబాద్‌లో మోర్చా జాతీయ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు, రాష్ట్ర నేతలు విస్సా కిరణ్‌కుమార్, టి.సాగర్, మురళీధర్‌రెడ్డి, బి.కొండల్, కన్నెగంటి రవి, మండల వెంకన్న తదితరులు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్రం ప్రకటించిన ఖరీఫ్‌- 2024 కనీస మద్దతు ధరలు రైతులను నిరాశపరిచాయి. చాలా పంటలకు ధరల పెంపుదల కేవలం 5 నుంచి 7 శాతమే ఉంది. పెసరకు 1.4% మాత్రమే పెంచారు. ఎమ్మెస్పీకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్లను మోదీ ప్రభుత్వం విస్మరిస్తోంది. రైతులకు రుణాల నుంచి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. దీనికోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా రుణమాఫీ ఆర్థికభారం ఉంటుందని తెలంగాణ అనుభవం తెలియజేస్తోంది. రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

జులై 10న కార్యాచరణ 

రైతుల దేశవ్యాప్త డిమాండ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే విషయమై జులై 10న జరిగే సమావేశంలో అన్ని సంఘాలు నిర్ణయం తీసుకుంటాయి’’ అని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని