సన్నిహితుల ఖాతాల్లోకి లంచం సొమ్ము!

గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 26 Jun 2024 07:09 IST

ఒక్కో యూనిట్‌కు రూ.2 వేలు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా వ్యవహరించిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన ఏసీబీ, మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి. దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు కల్యాణ్‌కుమార్‌ లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా షీప్‌ రియరింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఎస్‌ఆర్‌డీ) పథకాన్ని పర్యవేక్షించిన కల్యాణ్‌కుమార్‌తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్‌కు రూ.2 వేల చొప్పున అనధికారికంగా లబ్ధి పొందినట్లు దర్యాప్తులో తేలింది.  నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్‌ సంభాషణలను విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాలను సేకరించింది.

రెండు ఖాతాలకు రూ.2.5 లక్షల బదిలీ...

గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు 380 యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈక్రమంలోనే రామరాజు వద్ద పనిచేసిన వినయ్‌ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతేడాది నవంబరు 4న మధ్యాహ్నం 1.47 గంటలకు రామరాజు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. రెండు ఫోన్‌ నంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్‌కు సూచించినట్లు గుర్తించారు. ఈక్రమంలోనే వినయ్‌ బ్యాంకు ఖాతా ద్వారా పశుసంవర్ధకశాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్‌నంబర్‌కు ఆన్‌లైన్‌లో రూ.50 వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే కల్యాణ్‌ సన్నిహితుడి భార్య ఖాతాకు రూ.2 లక్షలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు 10.59 గంటలకు కల్యాణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసినట్లు తేలింది. 

1,894 ఇన్‌కమింగ్‌.. 1,311 ఔట్‌గోయింగ్‌ కాల్స్‌...

కల్యాణ్‌కుమార్‌ తరచూ ఓ ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది. మరోవైపు వినయ్, రామరాజు నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్‌కాల్స్‌ లేవని దర్యాప్తులో తేలింది. దీన్నిబట్టి గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కల్యాణ్‌కుమార్‌ అనధికారికంగా నగదు సమకూరినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రామరాజు తన ఉద్యోగి వినయ్‌ ద్వారా కల్యాణ్‌కుమార్‌కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అదే రోజు మహిళాఉద్యోగికి కల్యాణ్‌కుమార్‌ రెండుసార్లు ఫోన్‌ చేయగా.. ఆమె మరో రెండుసార్లు అతడికి ఫోన్‌ చేసినట్లు రికార్డుల్లో ఉంది. కల్యాణ్‌కుమార్‌ సీడీఆర్‌ను విశ్లేషించగా ఆమె నుంచి 1,894 ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉన్నట్లు.. కల్యాణ్‌ నుంచి మహిళా ఉద్యోగికి 1311 ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ ఉన్నట్లు వెల్లడైంది.


తరచూ నగదు రూపంలోనూ అందజేత

రామరాజు డ్రైవర్‌ నుంచి 161 సీఆర్పీసీ కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించింది. ఈ క్రమంలో రామరాజు తరచూ కల్యాణ్‌కుమార్‌ను కలిసేవాడని తేలింది. అలాంటి సమయాల్లో రామరాజు నగదురూపంలో కల్యాణ్‌కు డబ్బు ముట్టజెప్పేవాడని తేలింది. రామరాజుతోపాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్‌లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు తేలింది. ఇలాంటి వారితోనే కల్యాణ్‌కుమార్‌ దందా నడిపించినట్లు వెల్లడైంది. ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులతోపాటు కీలక ప్రజాప్రతినిధులకు స్థాయులవారీగా లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది. ఒక్కో యూనిట్‌కు రూ.2వేల చొప్పున కల్యాణ్‌కుమార్‌తోపాటు మరికొందరు లబ్ధి పొందినట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని