పీలిస్తే రో‘గాలే’!

పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల కారణంగా రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరుగుతుండగా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతను మరింత పెంచుతున్నాయి.

Published : 27 Oct 2023 05:09 IST

రాష్ట్రంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత
పలుచోట్ల స్వచ్ఛం నుంచి మధ్యస్థ స్థాయికి
చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల కారణంగా రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరుగుతుండగా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. కొద్ది రోజులుగా చలి పెరుగుతుండటంతో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తుండగా, కనిష్ఠ ఉష్రోగ్రతలు నమోదైన సమయాల్లో నాణ్యత సూచి స్వచ్ఛం నుంచి మధ్యస్థస్థాయికి పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పుడే తీవ్రత ఎందుకంటే

పీఎం 10 (సూక్ష్మధూళికణాలు) పీఎం 2.5 (అతిసూక్ష్మధూళికణాలు), ఓజోన్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌డయాక్సైడ్‌ వంటి పలు కాలుష్య కారకాలు పరిశ్రమలు, వాహనాలు, చెత్తను కాల్చడం ద్వారా వెలువడుతుంటాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఆయా ధూళికణాలు చెల్లాచెదురవుతాయి. చలికాలంలో గాలిలో కదలికలు తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ సేపు తక్కువ ఎత్తులో ఒకేచోట ఉండిపోతాయి. ఇవి ముక్కులోంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కోకాపేటలో అత్యధికంగా

దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గాలి నాణ్యత సూచిని నమోదుచేస్తుంది. నమోదయ్యే గణాంకాల ఆధారంగా ఈ సూచీని లెక్కిస్తారు. ఆ ప్రకారం హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో కొద్దిరోజులుగా వాయుకాలుష్యం పెరుగుతోంది. 

గాలి నాణ్యత సూచి లెక్కించేదిలా

0-50 పాయింట్ల వరకు ఉండే గాలి స్వచ్ఛమైనది. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరం. 101-200 మధ్యస్థం. 201-300 హీనం. 301-400 అతిహీనం. 401-500 ప్రమాదకరం.


చలి ప్రభావానికి దూరంగా ఉండాలి

ఆస్తమా, సీఓపీడీ వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవారు చల్లగాలి ప్రభావానికి గురికాకుండా చూసుకోవాలి. బయట తిరగాల్సి వస్తే ఎన్‌-95 మాస్క్‌ వాడాలి. ఉదయపు నడక అలవాటు ఉన్న వారు కాస్త ఎండ వచ్చాక బయటికెళ్లడం మంచిది. ఇన్‌ఫ్లూయోంజా వైరస్‌ ప్రభావంతో జలుబు, జ్వరం, ఒంటినొప్పులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. చలికాలంలో ఈ సమస్య ఉద్ధృతమయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక జబ్బులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఇన్‌ఫ్లూయోంజా వ్యాక్సిన్‌ తీసుకోవడం మేలు.

 డాక్టర్‌ జి.కె. పరంజ్యోతి,పల్మనరీ మెడిసిన్‌ విభాగాధిపతి, నిమ్స్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని