Hanamkonda: కేయూ హాస్టల్‌ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం

కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది.

Updated : 29 Jun 2024 07:52 IST

నుదిటిపై తీవ్ర గాయంతో విద్యార్థిని సంధ్య

విద్యానగర్‌(హనుమకొండ), న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్‌ సంధ్య కేయూలోని పోతన హాస్టల్‌ గది నం.19లో ఉంటూ రాజనీతిశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనం తరువాత గదికి వచ్చిన ఆమె మంచంపై తన వస్తువులు సర్దుకుంటుండగా సీలింగ్‌ ఫ్యాను ఒక్కసారిగా ఊడి మీద పడటంతో ఆమె నుదిటిపై తీవ్ర గాయమైంది. తోటి విద్యార్థినులు వెంటనే హాస్టల్‌ సూపర్‌వైజర్‌ శోభ సహాయంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. అనంతరం రిజిస్ట్రార్‌ మల్లారెడ్డి, హాస్టల్స్‌ సంచాలకుడు రాజ్‌కుమార్‌ ఆమెను కలిసి పరామర్శించారు. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టల్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాత భవనంలో ఎప్పుడో బిగించిన ఫ్యాన్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి కనీస మరమ్మతులు చేయించడం లేదని ఆరోపించారు. రిజిస్ట్రార్, హాస్టల్స్‌ సంచాలకుడు అక్కడికి చేరుకొని అన్ని సమస్యలను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ధర్నా విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని