Telangana Cabinet: తుది దశకు మంత్రివర్గ విస్తరణ

మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు.

Updated : 02 Jul 2024 06:46 IST

రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌!
కొత్త అమాత్యులు ఎవరో తేల్చే అవకాశం

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 3న దిల్లీకి వెళ్లే అవకాశముంది. గత వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇంట్లో జరిగిన సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ పాల్గొన్నారు. మళ్లీ వీరంతా పాల్గొంటారా... ముఖ్యమంత్రే అధిష్ఠానంతో చర్చించి ఖరారు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. 

ఏడెనిమిది మందికి పదవులు 

నిబంధనల ప్రకారం మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవచ్చు. ప్రస్తుతం నలుగురు/ఐదుగురికి అవకాశం ఇస్తారని, మిగిలిన ఖాళీలను తర్వాత నింపుతారని తెలుస్తోంది. మంత్రులతోపాటు ఉప సభాపతి, చీఫ్‌ విప్, పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశముంది. మొత్తంగా ఏడెనిమిది మందికి ఈ పదవులు లభించొచ్చు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.

  • ఉమ్మడి రంగారెడ్డి నుంచి స్పీకర్‌ ఉన్నారు. ఇదే జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారెవ్వరూ లేరు. భారాస నుంచి దానం నాగేందర్‌ చేరినా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. 
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఉండగా, ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించినందున మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం రానుంది. 
  • ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. 
  • ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పదవి దక్కుతుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచే దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌ పేరు కూడా వినిపిస్తోంది. 
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు అవకాశముండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. 
  • ఉమ్మడి వరంగల్‌ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 

సామాజిక సమీకరణాలే కీలకం 

ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా... మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు కీలక భూమిక పోషించనున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే... లంబాడాల నుంచి ఒకరికి ఉపసభాపతి లేదంటే చీఫ్‌ విప్‌ దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ పదవుల్లో ఒకదానికి డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని ఎస్టీలకిస్తే ఇతర పదవుల్లో సమీకరణాలు మారతాయి. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై మంగళవారంతో చర్చ ముగియనుంది. బుధవారం నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారు. అదేరోజు సీఎంతో ఇతర నాయకులు దిల్లీకి వెళ్లి తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని