SGT Transfers: 10 మంది విద్యార్థులు మించితే.. ఇద్దరు టీచర్లు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు.

Updated : 01 Jul 2024 05:26 IST

 పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు

ఎస్జీటీ బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం

పాక్షికంగా హేతుబద్ధీకరణ అమలు చేసినట్లే..! 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులు దాటిన చోట ఇక ఇద్దరు ఉపాధ్యాయులు రానున్నారు. 41 మంది పిల్లలు మించితే ముగ్గురు టీచర్లు ఉంటారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తీసుకున్న తాజా నిర్ణయం ఇది. 2015, 2021లలో ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మార్గదర్శకాల ప్రకారం.. 19 మంది విద్యార్థులు దాటితేనే ఇద్దరు టీచర్లను కేటాయించాలి. అయితే, విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా 10 మంది పిల్లలకు మించి ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అలా కేటాయించకున్నా సర్కారు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో చదువుల పరిస్థితి కొంత మెరుగవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం..

పిల్లల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో జీఓ 17, 2021లో జీఓ 25 జారీ చేసింది. ఆ ప్రకారం 0-19 మంది పిల్లలకు ఒక టీచర్, 20-60కి ఇద్దరు, 61-90కి ముగ్గురు, 91-120కి నలుగురు, 121-150కి అయిదుగురు, 151-200కి ఆరుగురు, 201-240కి ఏడుగురు, 241-280 మంది విద్యార్థులకు ఎనిమిది మంది ఉపాధ్యాయులను కేటాయించారు. 361-400 మంది విద్యార్థులకు ఏకంగా 11 మంది టీచర్లు ఉంటారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఇది అమలు జరగడం లేదు.

తాజా బదిలీల్లో ఇలా..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్జీటీల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 2015లో టీచర్ల హేతుబద్ధీకరణ చేశారు. అంటే పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించారు. తర్వాత 2021లో కొత్త మార్గదర్శకాలు ఇచ్చినా ఆ ప్రక్రియ కొనసాగలేదు. ప్రస్తుతం పిల్లలున్న చోట టీచర్లు లేరు.. ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు తక్కువగా ఉన్నారు. దీంతో తాజా బదిలీల్లో కొంత మార్పు తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకే ఈ సారి ఒక్క విద్యార్థి కూడా లేని బడులకు టీచర్లను ఇవ్వలేదు. 1-10 మంది ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 11-40 వరకు ఇద్దరు, 41-60 వరకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా ఖాళీలు చూపారు. ఆ ప్రకారం 10 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు పనిచేస్తుంటే ఒక్క ఖాళీనే చూపారు. 11 మంది ఉన్న చోట ఒక్కరే పనిచేస్తుంటే రెండో టీచర్‌ను ఇచ్చేలా ఖాళీ చూపారు. 60 మంది కంటే ఎక్కువ పిల్లలున్న చోట మాత్రం అన్ని ఖాళీలను చూపామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం గతంలో ఉన్న మాదిరిగానే అన్ని బడుల్లో ఖాళీలన్నింటిని చూపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పిల్లలు అధికంగా ఉన్న చోట కొత్తగా ఖాళీలను పెంచలేదని ఎస్సీ, ఎస్టీ టీచర్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు వీలుగా బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని సీఎం కార్యాలయం పేర్కొంది. అందుకు గతంలో ఉన్న నిబంధనలను కొంత సవరించినట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని