DSC: డీఎస్సీ పరీక్షల పూర్తి షెడ్యూలు విడుదల ఎన్నడో?

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయి షెడ్యూలును విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 27 Jun 2024 07:09 IST

జులై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి
ఇప్పటివరకూ సబ్జెక్టులవారీగా తేదీలు ప్రకటించని అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయి షెడ్యూలును విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలను జులై 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూలును గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించింది. అయితే, తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఇటీవల కొత్తగా టెట్‌ ఉత్తీర్ణులైనవారు.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, కొంతకాలంపాటు వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆగస్టు 15 తర్వాత నిర్వహించాలంటూ డీఎస్సీ హెల్ప్‌లైన్‌ డెస్క్‌కు పెద్దసంఖ్యలో అభ్యర్థులు ఈ-మెయిళ్ల ద్వారా కోరుతున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 

2.79 లక్షల దరఖాస్తులు..

రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. అభ్యర్థులపరంగా చూస్తే.. సుమారు 2 లక్షల వరకు ఉంటారని అంచనా. డీఎస్సీ పరీక్షలను జులై 17 నుంచి 31 మధ్య నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది. దాన్ని తాత్కాలిక షెడ్యూలుగా తెలిపింది. అంటే ఆ తేదీల్లో జరగొచ్చు లేదా మారొచ్చు. ఈ నెల 12న టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ సందర్భంగా కూడా డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూలును అధికారులు వెల్లడించలేదు. టెట్‌లో కొత్తగా పాసైన విద్యార్థులు.. తాము డీఎస్సీకి సన్నద్ధం అయ్యేందుకుగాను కనీసం నెల రోజులపాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పలువురు వినతిపత్రాలు అందజేస్తున్నారు. మరోవైపు, గతంలో టెట్‌ ఉత్తీర్ణులైనవారిలో కూడా అధిక శాతం మంది కనీసం నెల రోజులపాటు వాయిదా వేయాలంటున్నారు. డీఎస్సీలో వర్తమాన వ్యవహారాలకు 10, విద్యా దృకృథాల(పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌)కు 10 మార్కుల చొప్పున కేటాయించడంతో.. వాటిని చదివేందుకు సమయం పడుతుందని పేర్కొంటున్నారు.

విద్యాశాఖ గత ఫిబ్రవరిలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి పరీక్షలు ప్రారంభమైతే అభ్యర్థులకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగులుతాయి. అయితే, ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు ప్రకటించలేదు. మరోవైపు, పాఠశాల విద్యాశాఖ అధికారులు గత కొద్దిరోజులుగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. దాంతో డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూలుపై దృష్టి పెట్టలేదు. టెట్‌ ఫలితాలు విడుదల చేసిన రోజే పూర్తి షెడ్యూలు ప్రకటించి ఉంటే గందరగోళం తలెత్తేది కాదని రాష్ట్ర బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పరీక్షలను వాయిదా వేయడంతోపాటు ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలిపి భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రెండు, మూడు రోజుల్లో షెడ్యూలు!

షెడ్యూలు ఖరారుపై కసరత్తు జరుగుతోందని, ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ కేంద్రాల అందుబాటు వివరాలను టీసీఎస్‌ అయాన్‌ ప్రతినిధులు అందించారని.. 2-3 రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే 10-15 రోజులపాటు ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు మళ్లీ స్లాట్లు దొరకటం కష్టమవుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని