TG Tourism: పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో వనరులు అనేకం

రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.

Published : 04 Jul 2024 05:04 IST

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కేంద్రాలను తీర్చిదిద్దుతాం
రేపు ఎమ్మెల్యేలతో కలిసి నల్లమల అడవుల్లో అధ్యయనం: మంత్రి జూపల్లి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని.. ఆరు నెలల్లోనే పురోగతి సాధిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ప్రకృతి, ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకంపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. సచివాలయంలోని మీడియా సెంటర్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా నది బ్యాక్‌ వాటర్‌వైపు సోమశిలను డెస్టినేషన్‌ వెడ్డింగ్, సాహస పర్యాటకానికి అనువైన ప్రదేశంగా గుర్తించామని వెల్లడించారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్రమోట్‌ చేసేందుకు.. రాష్ట్రంలో లక్నవరం, రామప్ప, నాగార్జునసాగర్, అనంతగిరిహిల్స్‌ వంటి ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి అవకాశాలపై ఎమ్మెల్యేలతో కలిసి 5వ తేదీన నల్లమల అడవులకు వెళ్లి అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అనంతగిరిలో వెల్‌నెస్‌ టూరిజం రిసార్ట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. వనరుల్లేని సింగపూర్, దుబాయ్, ఆఫ్రికా దేశాలు.. తమ ప్రధాన ఆదాయ వనరుగా పర్యాటకాన్ని మలుచుకున్నాయి.. అనేక వనరులున్న తెలంగాణను పర్యాటకంలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధాన ముసాయిదాను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి రాష్ట్ర పర్యాటకానికి నిధులు కోరతామని చెప్పారు. గడిచిన పదేళ్లలో పర్యాటక శాఖ ఉన్నదనే విషయాన్ని గత ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి.. మౌలిక వసతుల కల్పనతో ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నాగర్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని.. బుద్ధగయా తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలు, కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్‌ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని