Bhatti Vikramarka: ఖనిజ ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలి

ఇసుక సహా వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Published : 12 Jun 2024 04:29 IST

కాళేశ్వరం మరమ్మతులకు ఆటంకం లేకుండా ఇసుక తరలించాలి
గనులశాఖపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి

గనులశాఖ అధికారులతో సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క

ఈనాడు, హైదరాబాద్‌: ఇసుక సహా వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌ రూపొందించి వెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గతంతో పోలిస్తే ఖనిజాల ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని.. ఇందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సూచించారు. గనులశాఖపై మంగళవారమిక్కడ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరంలోని ఇసుకను తవ్వి, తరలించే ప్రక్రియలో ఆ ప్రాజెక్టు మరమ్మతులకు ఆటంకం లేకుండా చూడాలని పేర్నొన్నారు. ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుకను తరలించాలని సాగునీటి అధికారులు కోరినట్టుగా సమాచారం ఉంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాలి. అదేవిధంగా రాష్ట్రంలోని నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌ల ఏర్పాటు, వాటికి టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలి. ఈ విషయాల్లో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలి’ అని భట్టి సూచించారు. జరిమానాలు వేసిన, మూసేసిన గ్రానైట్‌ క్వారీలపై సమీక్షించాలని పేర్కొన్నారు. పట్టా భూముల పేరిట గోదావరి తీరం వెంట ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతున్నారనీ..వీటిపై నిఘా పెట్టాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క అధికారులను కోరారు. ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు కేటాయించడం, వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తే దళారులకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందా? అనే అంశంపైన సమగ్ర సర్వే నిర్వహించాలని గనుల శాఖను భట్టి కోరారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థికశాఖ జాయింట్‌ సెక్రటరీ హరిత, స్పెషల్‌ సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని