Degree Contract lecturers: క్రమబద్ధీకరణ ఆశ నెరవేరేదెప్పుడో!

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు.. తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్‌) విషయమై ఎదురుచూపులు తప్పడం లేదు.

Published : 26 Jun 2024 06:14 IST

డిగ్రీ ‘కాంట్రాక్టు’ అధ్యాపకుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు.. తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ (రెగ్యులరైజేషన్‌) విషయమై ఎదురుచూపులు తప్పడం లేదు. కాంట్రాక్టు అధ్యాపకుల కొలువులను క్రమబద్ధీకరించే ప్రక్రియ ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు సగం మంది ఆశలు కూడా నెరవేరలేదు. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 797 మందిలో తొలివిడతగా 2022 మే నెలలో 270 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. మిగిలినవారికి యూజీసీ నిబంధనల ప్రకారం అవసరమైన అదనపు విద్యార్హతలైన పీహెచ్‌డీ/నెట్‌/సెట్‌ లేవని వారి దరఖాస్తులను ప్రభుత్వం పక్కనబెట్టింది. తర్వాత అందులో ఏదో విద్యార్హతను సాధించిన అధ్యాపకులు కళాశాల విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవడంతో వాటిని పరిశీలించిన ప్రభుత్వం 61 మందిని 2023 అక్టోబరులో రెగ్యులర్‌ చేసింది. ఈ మేరకు 331 మంది లబ్ధి పొందినా ఇంకా 466 మంది మిగిలిపోయారు. అప్పటికి అదనపు విద్యార్హతలు పొందలేకపోయారు. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అధ్యాపకులు, లైబ్రేరియన్లు, పీడీలు కలిపి 4,098 పోస్టులు ఉండాలి. రెగ్యులర్‌ పోస్టుల్లో 1,255 మందే పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ అయిన 331 మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను కలిపితే ఆ సంఖ్య 1,586 మాత్రమే. ఖాళీ పోస్టుల్లో అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు.

ఎప్పటికో అవకాశం!

ఉద్యోగాలు క్రమబద్ధీకరించకుండా మిగిలిపోయిన 466 మందిలో దాదాపు 300 మంది గత అక్టోబరు తర్వాత అదనపు అర్హతలు సాధించారు. కొందరు పీహెచ్‌డీలు పూర్తిచేయగా మరికొందరు యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్‌), రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీఎస్‌సెట్‌లో అర్హత సాధించారు. వారంతా గత 9 నెలలుగా క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల్లోని పీహెచ్‌డీ పట్టాలను కొంటున్నారనే ఆరోపణలున్నాయి. అలాగని నిబంధనల ప్రకారం అదనపు అర్హతలను సాధించిన వారిని పక్కన పెట్టడం సమంజసం కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి.. అవసరమైతే ఆయా వర్సిటీలు, యూజీసీ వివరణ తీసుకొని క్రమబద్ధీకరణ పూర్తిచేయాలని కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కోరుతున్నారు. గత ఏప్రిల్, మే నెలల జీతాలు ఇంతవరకు అందలేదు. మానసిక ఆందోళనతో కొందరు చనిపోతున్నారని టీజీడీసీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని