డబ్బులిచ్చి పోస్టింగ్‌కు ప్రయత్నిస్తే వేటు తప్పదు

డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్‌ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్‌ వెంటాడుతాయని స్పష్టంచేశారు.

Published : 03 Jul 2024 05:31 IST

అలాంటి పోలీసులను ఏసీబీ, విజిలెన్స్‌ వెంటాడతాయ్‌
పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
డ్రగ్స్, సైబర్‌ నేరాల నియంత్రణలో భాగం కావాలని సినీ పరిశ్రమకు పిలుపు

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీజీ న్యాబ్‌ ఏర్పాటు చేసిన వాల్‌ బోర్డుపై సందేశం రాస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: డబ్బులిచ్చి కోరుకున్న పోస్టింగ్‌ తెచ్చుకునేందుకు ప్రయత్నించే పోలీసులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటివారిని ఎవరూ కాపాడలేరని.. ఏసీబీ, విజిలెన్స్‌ వెంటాడుతాయని స్పష్టంచేశారు. విధినిర్వహణలో సామర్థ్యం, ప్రతిభ కనబరిచేవారికే పోస్టింగ్‌లలో, బదిలీల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఐపీఎస్‌ సందీప్‌ శాండిల్య పదవీకాలం పొడిగించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులతో హైదరాబాద్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. టీజీ న్యాబ్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ విభాగాలకు రూ.8 కోట్లతో కొనుగోలు చేసిన 155 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘దేశంలోకి చొరబాట్లను నియంత్రించేందుకు సరిహద్దుల్లో సైనికులు పహారా కాస్తున్న మాదిరిగానే ఏవోబీ నుంచి రాష్ట్రంలోకి గంజాయిని రానీయకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పదేళ్లలో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గల్లీగల్లీలో గంజాయి దొరుకుతోంది. గంజాయి మత్తులో చిన్నపిల్లలపై సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే, పోలీసులు రాజకీయ నిఘా, ప్రజాప్రతినిధుల భద్రతపై శ్రద్ధ పెడుతూ.. నేరగాళ్లను వదిలివేస్తున్నారు. నాతో సహా ప్రజాప్రతినిధులెవరికీ మితిమీరిన భద్రత అవసరం లేదు. ఇకపై నేర నియంత్రణకే ప్రాధాన్యమివ్వాలి. రాష్ట్రంలో కాలుపెట్టాలంటేనే సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల ముఠాలు భయపడేలా చేయండి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనేది బాధితులు, పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు మాత్రమే. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల కట్టడిలో సమర్థంగా పనిచేసిన పోలీసులకు నగదు ప్రోత్సాహం, పదోన్నతులు కల్పిస్తాం. ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి విధివిధానాలు సిద్ధం చేస్తాం. సైనిక స్కూళ్ల మాదిరిగా గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం. హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు అందులో చదువుకోవచ్చు. 

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలి..

దేశంలో ఎక్కడ ఉగ్ర దుశ్చర్యలు చోటుచేసుకున్నా అదనపు సమాచారం కోసం కేంద్ర హోంశాఖ అధికారులు తెలంగాణ ఎస్‌ఐబీ సహకారం కోరుతున్నారు. నేరగాళ్ల ఆలోచనను, ఎత్తుగడలను ముందే గుర్తించి అరికట్టే ప్రతిభ ఉండటమే అందుకు కారణం. తెలంగాణ బ్రాండే హైదరాబాద్‌. నగరంలో నేరాలను నియంత్రించకపోతే, అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పోలీసులంతా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

బంజారాహిల్స్‌ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, నిఘా విభాగం చీఫ్‌ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, డీజీపీ రవిగుప్తా, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్, టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, రాచకొండ కమిషనర్‌ తరుణ్‌ జోషి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రమేశ్‌రెడ్డి

డ్రగ్స్, సైబర్‌ నేరాల నియంత్రణపై వీడియోలు ఇవ్వాలి..

‘డ్రగ్స్‌ నియంత్రణకు సినీ నటుడు చిరంజీవి తన వంతుగా ఒక వీడియో తీసి మాకిచ్చారు. ఆయన స్ఫూర్తితో మరికొందరు ముందుకొచ్చి యువత డ్రగ్స్‌కు అలవాటైతే తలెత్తే నష్టాలపై వీడియోలు రూపొందించి పోలీసు విభాగానికి అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగమైనందుకు చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సైబర్‌ నేరాల నియంత్రణలో సినీరంగ ప్రముఖులు, సినిమా థియేటర్ల యాజమాన్యాలు భాగం పంచుకోవాలి. డ్రగ్స్, సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేలా ఒకట్రెండు నిమిషాల నిడివి ఉండే వీడియోలను తీసుకొచ్చి ఇస్తేనే సినిమాలకు వెసులుబాట్లు కల్పిస్తాం. డ్రగ్స్, సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన వీడియోలు ఉచితంగా ప్రదర్శించేందుకు ముందుకొచ్చిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి థియేటర్‌లో సినిమా ప్రారంభానికి ముందు ఈ వీడియోలు ప్రదర్శించాలన్న నిబంధన విధించాలని సమాచారశాఖ అధికారులను ఆదేశిస్తున్నాను. ఈ రెండు అంశాలపై మీడియా సైతం అవగాహన కల్పించాలి’’ అని రేవంత్‌రెడ్డి కోరారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన వీక్షించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు టీజీ న్యాబ్‌ ఏర్పాటు చేసిన వాల్‌బోర్డుపై సందేశం రాసి.. సంతకం చేశారు. కార్యక్రమాల్లో డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బి.శివధర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జితేందర్, టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్, హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, అవినాష్‌ మహంతి, తరుణ్‌ జోషి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ రమేశ్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

టీజీన్యాబ్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోల  పనితీరుపై సీఎంకు సమర్పించిన నివేదికలోని మరిన్ని వివరాలు 

టీజీ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో..

  • మత్తుపదార్థాల కట్టడిలో నార్కోటిక్స్‌ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే 2 నెలల్లో 4 నార్కోటిక్స్‌ పోలీస్‌ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
  • 7 నార్కోటిక్స్‌ ల్యాబ్‌ల ద్వారా జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌లను అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ లావాదేవీలపై నిఘా ఉంచారు. 790 కేసుల్లో 1,556 మందిని అరెస్ట్‌ చేసి.. రూ.77 కోట్ల నగదు సీజ్‌ చేశారు. 
  • అల్ప్రాజోలం తయారు చేసే 4 యూనిట్లపై దాడులు జరిపి 28.592 కిలోల అల్ప్రాజోలం, 560 కిలోల క్లోరల్‌ హైడ్రేట్‌ స్వాధీనం చేసుకున్నారు. 
  • విద్యాసంస్థల్లో 3,600 యాంటీ డ్రగ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.
  • టీజీ న్యాబ్‌ ద్వారా మత్తుపదార్థాలు సరఫరా చేసేవారిపై కేసులు, శిక్షలు 13 శాతం పెరిగాయి.
  • మాదక ద్రవ్యాల నియంత్రణకు కేసుల నమోదు, దర్యాప్తు తదితర నైపుణ్యాల పెంపునకు 3,020 మందికి శిక్షణ ఇచ్చారు. 
  • 56 విద్యాసంస్థల్లో 3,800 యాంటీ డ్రగ్‌ కమిటీల సారథ్యంలో 8,084 మంది విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
  • 3,116 మంది విద్యార్థులు యాంటీ డ్రగ్‌ సోల్జర్లుగా నమోదయ్యారు.
  • డ్రగ్స్‌కు అలవాటుపడిన 536 మందిని 11 డీ-ఎడిక్షన్‌ కేంద్రాల ద్వారా వైద్యసహాయం అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చారు. 
  • టీజీ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోకు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు కేటాయించింది. 27 కార్లు, 59 ద్విచక్ర వాహనాలు అందజేసింది. అదనంగా 170 మంది సిబ్బందిని నియమించింది. 

టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో..

  • రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ నేరాలపై ఏటా 10 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేస్తున్నారు. 
  • దేశవ్యాప్తంగా నమోదైన 77 వేల సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో 671 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించి ఇతర రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందజేశారు. 
  • రాష్ట్రంలో కొత్తగా 7 సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
  • కొత్తగా 55 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయి.

టీజీన్యాబ్, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోల పనితీరుపై సంతృప్తి

డాది వ్యవధిలో టీజీన్యాబ్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోల పనితీరుపై ఉన్నతాధికారులు నివేదిక అందజేయగా.. ఆ విభాగాల పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. కేసుల నమోదు, దర్యాప్తులో సమర్థంగా పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. నివేదికలో పేర్కొన్న ప్రకారం..  ఏడాది వ్యవధిలో మాదకద్రవ్యాల రవాణాపై 1,892 కేసులు నమోదయ్యాయి. 3,792 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. రూ.179.3 కోట్ల సరకును స్వాధీనం చేసుకున్నారు. 5 కేసుల్లో రూ.47.16 కోట్ల విలువైన సొత్తును జప్తు చేశారు. 679 కేసుల్లో రూ.102.41 కోట్ల విలువైన 42,190 కిలోల గంజాయి ధ్వంసం చేశారు. టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాక ఇప్పటివరకు 2,52,187 ఫిర్యాదులు అందాయి. 1,57,26 అనుమానాస్పద బ్యాంకు ఖాతాల్లోని రూ.263 కోట్లు జప్తు చేశారు. 5,191 మంది బాధితులకు రూ.32 కోట్లు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని