CM Revanth Reddy: అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా?

వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని.. మౌఖిక ఆదేశాలతో ఏకంగా రూ.626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 30 Jun 2024 06:08 IST

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం రూ.626 కోట్లు పెరగడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశం
ఓరుగల్లు అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష 
మంత్రులతో కలిసి పర్యటన
వనమహోత్సవానికి శ్రీకారం

నిర్మాణంలో ఉన్న వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూకు ఆదేశాలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.చిత్రంలో మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈనాడు - వరంగల్, వరంగల్‌ కార్పొరేషన్, గీసుకొండ - న్యూస్‌టుడే: వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా ఎందుకు పెంచారని.. మౌఖిక ఆదేశాలతో ఏకంగా రూ.626 కోట్లు అదనంగా ఎలా ఖర్చు చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. శనివారం ఆయన మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించారు. సీఎం మొదట హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో నిర్మిస్తున్న కాకతీయ మెగా జౌళి పార్కుకు చేరుకున్నారు. కైటెక్స్‌ వస్త్ర పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటి ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. తర్వాత వివిధ అంశాలపై హనుమకొండ సమీకృత కలెక్టరేట్‌లో మంత్రులు, సంబంధిత అధికారులతో కలిసి సుమారు 2 గంటలసేపు సమీక్ష నిర్వహించారు.మొదట రూ.1100 కోట్లుగా అంచనా వేసిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయాన్ని.. ఏకంగా రూ.1726 కోట్లకు ఎలా పెంచారని రేవంత్‌రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. వరంగల్‌ను ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ తరహాలో ఓరుగల్లులోనూ పిల్లల చికిత్స కోసం అత్యాధునిక ఆసుపత్రి నిర్మించాలని, ఎంజీఎం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కంటి, క్షయ ఆసుపత్రులు ఇక్కడే ఉన్నందున అన్నిటినీ అనుసంధానం చేస్తూ హెల్త్‌సిటీని తీర్చిదిద్దాలని సూచించారు. ఇప్పుడున్న ఆటోనగర్‌ను మరోచోటుకు తరలించి, ఆ స్థలాన్ని హెల్త్‌సిటీ కోసం వినియోగించాలని చెప్పారు.

మాస్టర్‌ప్లాన్‌ 2050 రూపొందించండి

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని సీఎం తెలిపారు. తెలంగాణకు సాంస్కృతిక రాజధాని, వారసత్వ నగరమైన వరంగల్‌ విశిష్టతను, చారిత్రక వైభవాన్ని కాపాడుకుంటూ నిర్దిష్టమైన ప్రణాళికలు రచించాలని, సమగ్రాభివృద్ధికి ‘మాస్టర్‌ ప్లాన్‌ 2050’ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌ అభివృద్ధిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 20 రోజులకోసారి సమీక్షించాలని సూచించారు. భూసేకరణ పూర్తి చేశాకే ఇన్నర్, ఔటర్‌ రింగురోడ్డు పనులు మొదలుపెట్టాలని చెప్పారు. రెండు జాతీయ రహదారులు అనుసంధానమయ్యేలా ఔటర్‌ రింగు రోడ్డు ఉండాలని, ఔటర్‌ నుంచి మెగా జౌళి పార్కుకు కనెక్టివిటీ ఉండాలని సూచించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, డంపింగ్‌యార్డు తదితర అంశాలపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్‌ వరంగల్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), ఇతర ప్రభుత్వ శాఖలు చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం అధికారులు రూ.6115 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా.. ఆ నిధులను విడతలవారీగా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ,   పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎస్‌ శాంతికుమారి, వరంగల్‌ మేయర్‌ సుధారాణి 

వస్త్రపరిశ్రమ అభివృద్ధికి కృషి

కాకతీయ జౌళి వస్త్రపరిశ్రమ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాకతీయ మెగా జౌళి పరిశ్రమ (కేఎంటీపీ)ను సందర్శించిన అనంతరం రేవంత్‌రెడ్డి కైటెక్స్‌ కంపెనీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రులతో కలిసి తిలకించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మూడు నిమిషాల వీడియో ద్వారా సీఎంకు వివరించారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో భారీ వర్షాల సమయంలో నీళ్లు బాగా నిలిచిపోతుండడంపై సీఎం స్పందించారు. వస్త్రపరిశ్రమ ఆవరణలో 10 ఎకరాల భూమిని ప్రత్యేకంగా కేటాయించి వరద నీరు పోయే వ్యవస్థను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీజీఐఐసీ అధికారులు తెలిపారు. వస్త్రపరిశ్రమకు భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సీఎంను కోరగా.. 1223 మంది భూనిర్వాసితులకు ప్లాట్లు సిద్ధం చేశామని, పైలాన్‌ సమీపంలో మిగిలిన 150 మందికి వాటిని కేటాయిస్తామని టీజీఐఐసీ అధికారులు వివరించారు. భూనిర్వాసితులకు రూ.5 లక్షల చొప్పున వెచ్చించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి, అన్ని వసతులతో కూడిన టౌన్‌షిప్పును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.


సర్వపిండి బాగుంది.. 

మహిళా సంఘాల సభ్యులకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

హనుమకొండ కలెక్టరేట్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వంటకాలను సీఎం, మంత్రులు రుచి చూశారు. బిర్యానీ, చిరుధాన్యాల వంటకాలు, అరిసెలు, సకినాలు, సర్వపిండి, లడ్డూలను క్యాంటీన్‌ నిర్వాహకులు వడ్డించగా.. సీఎం అరిసెలు, సకినాలు, సర్వపిండిని రుచి చూశారు. సర్వపిండి బాగుందంటూ మరికొంచెం అడిగి తిన్నారు. సీఎం పర్యటనకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని