Revanth Reddy: కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని,

Updated : 05 Jul 2024 04:23 IST

రాజకీయాలు ఎన్నికల వరకే
అందుకే ప్రధాని మోదీ, అమిత్‌షాలను కలిసి వినతిపత్రాలు ఇచ్చాం
నాడు కేంద్రంతో కేసీఆర్‌ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది 
మా పాలనకు మార్క్‌గా మూసీ నది అభివృద్ధి 
దిల్లీ ఇష్టాగోష్ఠిలో రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చామన్నారు. వారివైపు నుంచి కూడా సానుకూల స్పందన కన్పించిందని తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసిన తర్వాత ఆయన గురువారం ఇక్కడి తన అధికార నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ ఫలానా తేదీన చేపడతామని తాను ఎప్పుడూ చెప్పలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం గురించి ఏఐసీసీ అధ్యక్షుడికి చెప్పామని, ఈ రెండు విషయాలు ఆయన పరిశీలనలో ఉన్నాయని మాత్రమే ఇదివరకు తాను అన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బంతి ఏఐసీసీ అధ్యక్షుడి కోర్టులో ఉందన్నారు. తర్వాత ఆయన విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

గ్రూప్‌ 1 పోస్టుల భర్తీని అడ్డుకోవడానికి కొందరి ఎత్తులు

‘‘గ్రూప్‌ 1 పరీక్షల్లో అభ్యర్థుల నిష్పత్తిని 1:100కి మార్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. 2022లో అప్పటి ప్రభుత్వం 1:50 అని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారం పరీక్షలు నిర్వహించారు. పేపర్లు లీక్‌ కావడంతో ఆ పరీక్షలు రద్దయ్యాయి. ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను జతచేసి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించాం. పరీక్షలు పూర్తయిన తర్వాత అభ్యర్థుల నిష్పత్తిని 1:100 చేస్తూ ఉత్తర్వులిస్తే కోర్టు అయిదు నిమిషాల్లో వాటిని కొట్టేస్తుంది. మేం గ్రూప్‌ 1 పోస్టులను భర్తీ చేయకుండా అడ్డుకోవడానికే కొందరు ఈ ఎత్తులు వేస్తున్నారు. అన్ని ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ తరహాలో నిర్వహించడానికి నిపుణుల చేత అధ్యయనం చేయిస్తున్నాం. ఒక పరీక్షకు మరోటి అడ్డురాకుండా క్యాలెండర్‌ తయారు చేస్తున్నాం. 

తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రాకు వదిలిపెట్టిందే కేసీఆర్‌. ఇప్పుడు అవి కలపాలని డిమాండ్‌ చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనం. కేసీఆర్‌ తెలంగాణ సీఎం అయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. కె.కేశవరావు సేవలను రాష్ట్రంలో ఉపయోగించుకుంటాం. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తాం.

36 నెలల్లో మూసీ నది అభివృద్ధి

రాష్ట్రంలో మా ప్రభుత్వ పాలనకు మార్క్‌గా మూసీ నదిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. గండిపేట నుంచి రింగ్‌ రోడ్‌ వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవున దీని అభివృద్ధి ఉంటుంది. దీని నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు 15 టీఎంసీలు తరలించేలా పెద్ద లైన్‌ వేస్తాం. త్వరలో టెండర్లు పిలుస్తాం. ఇప్పటికే లండన్‌ థేమ్స్‌ నదిని చూశాం. ఆగస్టులో జపాన్, కొరియాకు వెళ్తున్నాం. నదికి రెండువైపుల ఉన్న ఆక్రమణలను తొలగించి భూమిని అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం అక్కడ 10,500 నిర్మాణాలున్నాయి. వాటిని ఖాళీ చేయించాలి. బాధితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తాం. లేదంటే సమీపంలో భూసమీకరణ చేసి భూమి ఇస్తాం. అదీ కాదంటే టీడీఆర్‌ బాండ్లు జారీ చేస్తాం. ఇవేవీ కాదంటే పరిహారం అందిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎవ్వరికీ కేటాయించని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు 35 వేల వరకు ఉన్నాయి. ఇక్కడ పదివేల మంది అంగీకరిస్తే ఆ ఇళ్లు కేటాయించేస్తాం. ఈ మార్గంలో పైన మెట్రో రైలు వెళ్లేలా డిజైన్‌ చేస్తున్నాం. ఇందుకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలను ఎంపిక చేశాం. మొత్తం 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది మా ఉద్దేశం. మొత్తం మూడు, నాలుగు క్లస్టర్లుగా దీన్ని అభివృద్ధి చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బడ్జెట్‌ సమావేశాల తర్వాతే దానిపై ఆలోచిస్తాం.

నాడు కేంద్ర పథకాలను పక్కన పెట్టిన కేసీఆర్‌ 

గత కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అనుసరించడంవల్ల రాష్ట్రానికి విపరీతమైన నష్టం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వాడుకోకపోవడంవల్ల తెలంగాణకు నిధులే అక్కర్లేదని కేంద్రం సున్నా చేసింది. కేసీఆర్‌ తన మొదటి టర్మ్‌లో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించినా రాష్ట్రానికి నిధులేమీ తేలేదు. ఆయన చేపట్టిన కాళేశ్వరం, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ తప్ప ప్రజలకు మరేమీ గుర్తుకురాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర పథకాలను పక్కనపెట్టారు. ప్రతిష్ఠ పెంచుకోవడానికి చేసిన ఆ మూడు పథకాలే కేసీఆర్‌ను దెబ్బతీశాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ వల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడంలేదు. కేసీఆర్‌ అన్ని ఫోన్లు ట్యాప్‌ చేసి చివరకు ఏం చేయగలిగారు! అలాంటి తప్పుడు పనులు చివరకు వాళ్లనే మింగేస్తాయి. 

లోక్‌సభ ఎన్నికల్లో.. 

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల్లో మంచి బలం ఉన్న నాయకులంతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. దానివల్ల కొత్తవారిని ఎంచుకోవాల్సి వచ్చింది. అదే భాజపాలో ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌తోపాటు, ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఎంపీగా పోటీచేశారు. వారికి అప్పటికే ప్రజల్లో గుర్తింపు ఉండటంవల్ల ఎంపీ ఎన్నికల్లో సానుకూలంగా మారింది. ఒకవేళ వారంతా ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటే భాజపాకు ఎంపీ అభ్యర్థులు దొరకడం కష్టమయ్యేది. ఈ ఎన్నికల్లో వ్యక్తిగత పోటీ కనిపించింది. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ను 13వేలతో గెలిపించిన ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో భాజపాకు 18వేల మెజార్టీ ఇచ్చారు. దాన్నిబట్టి ఎంత క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందో ఊహించుకోవచ్చు.

ఈవీఎంలను తారుమారు చేయొచ్చేమో!

ఈవీఎంలను తారుమారు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోంది. అయితే వాటిని ఎక్కడో కూర్చొని రిమోట్‌ ద్వారా మార్చవచ్చా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రతి ఎన్నికకు 15% ఈవీఎంలను అధికంగా పంపుతారు. వాటితో కూడా ఏదైనా చేయొచ్చేమో! ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ దగ్గర కలెక్ట్‌ చేసుకొని ఎన్నిక పూర్తయిన తర్వాత మళ్లీ అదే సెంటర్‌లో ఒక రోజంతా పెడతారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వద్ద వాటిని ఉంచినప్పుడు పెద్దగా బందోబస్తు ఉండదు కాబట్టి అక్కడ అవకతవకలు చేయడానికి అవకాశం ఉందనిపిస్తోంది.

కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం... 

త్వరలో ఆరోగ్యశ్రీకి రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా చేసి కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో వరి పండించే రైతులకు రూ.500 ప్రోత్సాహకం ఇస్తాం. సన్న వడ్లు పండించేలా వారిని ప్రోత్సహిస్తాం. వాటినే మిల్లింగ్‌ చేయించి రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. ఆ బియ్యాన్ని వినియోగదారులే తింటారు కాబట్టి బయట అమ్ముకొనే పరిస్థితి ఉండదు. దానివల్ల రీసైక్లింగ్‌ ఆగిపోతుంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

భారాసకు చరిత్ర ఉంది.. భవిష్యత్తు లేదు

ప్రస్తుతం లోక్‌సభలో భారాసకు ఒక్క సీటుకూడా లేదని, ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంత దీనావస్థ ఎప్పుడూ కనిపించలేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలే కాకుండా కేసీఆర్‌కూడా భారాస కోసం టార్చ్‌లైట్‌ వేసుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు భారాస అన్నది గత చరిత్ర అన్నారు. ఆ పార్టీకి చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదన్నారు. సమావేశంలో ఎంపీలు బలరాంనాయక్, అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ పదవుల కోసం కొత్తగా గవర్నర్‌కు ప్రతిపాదనలు

మ్మెల్సీ పదవులకు గత భారాస ప్రభుత్వం, అలాగే మేం వచ్చిన తర్వాత చేసిన సిఫార్సులన్నింటినీ రద్దు చేసి కొత్తగా గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపుతాం. దానివల్ల సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.


ఇప్పుడు రైతులు సన్న వడ్లు పండిస్తారు

తంలో కేసీఆర్‌ దొడ్డు, సన్న వడ్లకు ఒకే రేటు ఇస్తామని చెప్పడంవల్లే రైతులు సన్న వడ్లు వేయలేదు. ఇప్పుడు మేం రూ.500 ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల రైతులు సన్న వడ్లు పండిస్తారు.

సీఎం రేవంత్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని