CM Revanth Reddy: తెలంగాణ ఏర్పాటులో డీఎస్‌ పాత్ర కీలకం

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 01 Jul 2024 05:20 IST

ప్రజలకు ఆయన సేవలు గుర్తుండేలా చర్యలు చేపడతాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పీసీసీ మాజీ అధ్యక్షుడికి నివాళి

డి.శ్రీనివాస్‌ పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో షబ్బీర్‌ అలీ, 
సుదర్శన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి.అర్వింద్, డి.సంజయ్, జీవన్‌రెడ్డి తదితరులు

ఈనాడు, నిజామాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని.. ఆయన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో డి.శ్రీనివాస్‌ నివాసంలో ఆయన పార్థివదేహంపై సీఎం పుష్పగుచ్ఛం ఉంచి.. నివాళులర్పించారు. డి.శ్రీనివాస్‌ కుమారులు ఎంపీ అర్వింద్, సంజయ్‌ సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. డి.శ్రీనివాస్‌ విద్యార్థి దశ నుంచి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతగా కొనసాగారన్నారు. 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో ఎంతో కృషి చేశారని.. 2009లోనూ ఆయన సారథ్యంలోనే పార్టీకి మళ్లీ అధికారం దక్కిందని గుర్తుచేశారు. పార్లమెంటులో డి.శ్రీనివాస్‌ను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించేవారని చెప్పారు. ఆయన మరణం కాంగ్రెస్‌కు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.  చనిపోయాక తనపై కాంగ్రెస్‌ జెండా కప్పాలనేది ఆయన కోరిక అని, అందుకే ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సహా ముఖ్య నేతలను పంపి.. దాన్ని నెరవేర్చామని చెప్పారు. ఆయన ప్రజలకు అందించిన సేవలు గుర్తించి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. డి.శ్రీనివాస్‌ మృతికి అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీలు సంతాపం తెలిపారన్నారు. ఆయన గౌరవం ఇనుమడించేలా, ప్రజలు, అభిమానులు సేవలను గుర్తుంచుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.  కుటుంబ సభ్యులతో చర్చించాక.. ఆయన జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. డీఎస్‌ పార్థివదేహానికి కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌(కేరళ) నివాళులు అర్పించారు. అనంతరం నిజామాబాద్‌లో అంతిమయాత్ర చేపట్టారు. నగర శివారులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. డి.శ్రీనివాస్‌ చితికి పెద్ద కుమారుడు సంజయ్‌ నిప్పంటించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వివేక్, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, మధుయాస్కీగౌడ్, వీహెచ్, లగడపాటి రాజగోపాల్‌లు.. డి.శ్రీనివాస్‌కు నివాళులు అర్పించారు.

డి.శ్రీనివాస్‌ మృతికి దీపా దాస్‌మున్షీ సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌(డీఎస్‌).. సిద్ధాంతాన్ని నమ్మిన క్రమశిక్షణ గల నాయకుడని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ పేర్కొన్నారు. డీఎస్‌ మృతికి దీపా దాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని