Crop Loan Waiver Scheme: కుటుంబానికి రూ.2 లక్షలు!

రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు.

Updated : 29 Jun 2024 06:43 IST

పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక
బంగారంపై అప్పులకు పథకం వర్తించదు..
3, 4 రోజుల్లో మార్గదర్శకాలు
దీని తర్వాతే రూ.4 వేల పింఛనుపై దృష్టి 
కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు
రుణాల రీస్ట్రక్చర్‌తో వడ్డీ భారం తగ్గించుకుంటాం
దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: రైతు రుణమాఫీ మార్గదర్శకాలను మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయన్నారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో చర్చించడానికి గత అయిదు రోజులుగా దిల్లీలో ఉన్న సీఎం.. శుక్రవారం తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా పంట రుణాలను లెక్కిస్తామని చెప్పారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు. రూ.2 లక్షల మేర తీసుకున్న రుణాలు రూ.6-7 వేల కోట్లు ఉండవచ్చని ఆయన అంచనాగా చెప్పారు. అత్యధికంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సన్న, చిన్నకారు రైతులు తీసుకున్న రుణాలే ఉంటాయన్నారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు రూ.4 వేలకు పెంపుపై దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

పదవుల్లో సామాజిక న్యాయం

‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఆరు పదవులను భర్తీ చేయాలా? లేదా? అనేది పరిశీలిస్తాం. పీసీసీ అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ అన్నీ ఒకేసారి పూర్తి చేస్తాం. మంత్రులు, పీసీసీ పదవి విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు 50% పదవులు ఉండాలన్నది కాంగ్రెస్‌ నిబంధన. పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవు. కాంగ్రెస్‌ బీ ఫాంపై గెలిచినవారికే ఇస్తాం. పీసీసీ అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా? ఇప్పటికే పదవిలో ఉన్న వారికి ఇవ్వాలా? అనే అంశాలపై చర్చించలేదు. రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుల పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త సభ్యులను నియమించాక కులగణన మొదలుపెడతాం. 

గతంలోనూ ఫిరాయింపులు జరిగాయి

పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. కేసీఆర్‌ హయాంలోనూ జరిగాయి. ఏపీలో చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపుర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జరిగాయి. తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఏకంగా భాజపాలోకి విలీనం చేసుకున్నారు. 

కేంద్ర బడ్జెట్‌ తర్వాతే రాష్ట్రంలో..

కేంద్ర బడ్జెట్‌ పెట్టిన ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభిస్తాం. గత బడ్జెట్‌లో చెప్పిన రాబడిలో 60 శాతమే వచ్చింది. 40% కాగితాలకే పరిమితమైంది. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే వాస్తవ అంచనాలతో బడ్జెట్‌ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర రుణాలను రీస్ట్రక్చర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఇదివరకే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడాం. ఎన్నికలు రావడంతో ఆ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంది. తక్కువ వడ్డీకి కొత్త అప్పులు తీసుకొని ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను చెల్లించాలనుకుంటున్నాం. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పుంది. పెండింగ్‌ బిల్లులు రూ.లక్ష కోట్లు ఉన్నాయి. అప్పులపై 1% వడ్డీ భారం తగ్గినా ఏడాదికి రూ.7 వేల కోట్లు ఆదా అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన 2014లో రుణాల చెల్లింపు మొత్తం ఏడాదికి రూ.6,500 కోట్లు ఉంటే ఇప్పుడు నెలకే రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. 

ఉన్న అధికారులనే వినియోగించుకుంటాం

ఉన్నవారిలో ఉత్తమంగా పనిచేసే అధికారుల సేవలను వినియోగించుకుంటున్నాం. చూసేవారికి పెద్దమార్పు కనిపించకపోయినా ఫర్వాలేదు. ప్రజలకు నష్టం జరగకపోతే చాలు. మార్పు చూపించాలన్న అత్యుత్సాహంతో అడ్డదారులు తొక్కితే నష్టం జరుగుతుంది. నేను అధికారం చేపట్టిన 200 రోజుల్లో 100 రోజులు ఎన్నికలకే సరిపోయింది. గత పాలకులు ఏదో చేశారన్న కక్షతో దాన్ని చెడగొట్టాలని చూస్తే అమరావతిలో పిచ్చిచెట్లు పెంచినట్లే అవుతుంది. కలెక్టర్లు, ఎస్పీలతోనే క్షేత్రస్థాయిలో పరిపాలన జరుగుతుంది కనుక వారిని పూర్తిస్థాయిలో మార్చాం. ఉన్నతస్థాయిలో అందుబాటులో ఉన్న అధికారులను కొనసాగిస్తున్నాం. 

జిల్లాలు, మండలాల పునర్విభజనకు కమిషన్‌ 

జిల్లాల సంఖ్య కుదిస్తామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఉన్న వాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పాను. ప్రస్తుత 33 జిల్లాల్లో ఒక దాంట్లో కోటి జనాభా ఉంటే మరో దాంట్లో మూడు లక్షల మందే ఉన్నారు. అందుకే వీటిని హేతుబద్ధీకరించాలి. మండలాలు కూడా ఎన్టీఆర్‌ హయాంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన వాటన్నింటినీ తాత్కాలిక ప్రాతిపదికనే ఏర్పాటు చేశారు తప్ప.. ప్రస్తుత జనాభా, అభివృద్ధి, అవసరాల ప్రాతిపదికన చేయలేదు. వీటిపై బడ్జెట్‌ సమావేశాల్లో అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. కమిషన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం. 

ఉపసంఘం సిఫార్సుల మేరకు రైతు భరోసా

రైతుభరోసా పథకం విధివిధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రైతుబంధు కింద కేసీఆర్‌ రూ.75 వేల కోట్లు ఇస్తే అందులో రూ.25 వేల కోట్లు అనర్హులకే వెళ్లింది. వారి నుంచి రికవరీ చేయడం గురించి ఆలోచించడంలేదు. ధరణి లోపాలను సరిదిద్దే పని జరుగుతోంది. దాని స్థానంలో భూభారతి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం ప్రతినెలా రూ.350 కోట్లు చెల్లిస్తున్నందున ఆర్టీసీకి ఆదాయం పెరిగి నష్టాలు లేని స్థితికి చేరింది. త్వరలో లాభాల్లోకి వస్తుంది. ఆక్యుపెన్సీ 80%కి పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యం వల్ల చాలామంది మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్తుండడంతో ఆలయాల ఆదాయం పెరిగింది. 

కొత్త విమానాశ్రయాలపై దృష్టి

వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్‌ జీఎంఆర్‌ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్‌పోర్టు ఉండకూడదన్న నిబంధన ఉంది. వరంగల్‌ 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల భద్రాచలంవైపు కొత్త ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఈ నిబంధన వర్తించదు. కొత్త ఎయిర్‌పోర్టులకు లాభదాయకత ఉంటుంది. వరంగల్‌ నుంచి తిరుపతి, వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలకు నేరుగా విమానాలు నడిపితే మంచి డిమాండ్‌ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్తు కొరతే లేదు. ఎక్కడో సాంకేతిక కారణాల వల్ల తలెత్తే సమస్యను కొందరు కోత అని ప్రచారం చేస్తున్నారు. 

ఉచితాలు ‘అనవసరం’ కాదు

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలను అనవసర ఖర్చుగా పరిగణించకూడదు. మోదీ ఈ పదేళ్లలో కార్పొరేట్‌ సంస్థలకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. దాంతో పోలిస్తే ఉచిత పథకాల కింద ప్రజలకు అందిస్తున్నందెంత? కార్పొరేట్‌ సంస్థలకు మాఫీ చేస్తే ప్రోత్సాహకం, పేదలు, రైతులకు ఇస్తే సబ్సిడీ అంటున్నారు. ఇది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. 

అదానీకి ఆస్తులు రాసివ్వడంలేదు..

మోదీకి అదానీ మిత్రుడని మాట్లాడిన మేం.. ఇప్పుడు పాతబస్తీలో విద్యుత్తు పంపిణీని అప్పగిస్తే విమర్శలొస్తాయన్నది నిజమే. కానీ మేం మోదీలా ప్రభుత్వరంగ సంస్థలను అదానీకి రాసివ్వడంలేదు. అలా ఇవ్వడాన్ని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు తప్ప.. అసలు వ్యాపారమే చేయకూడదని చెప్పలేదు. మేం అదానీనీ విద్యుత్తురంగంలో పెట్టుబడులు పెట్టమనే కోరుతున్నాం. ఆయనకు ఎలాంటి ఆస్తులూ రాసివ్వడంలేదు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా ఆహ్వానిస్తాం. ఆగస్టులో అమెరికాకు వెళ్లినప్పుడు రాష్ట్రంలో టెస్లా ప్లాంట్‌ పెట్టే అంశంపై ఎలాన్‌మస్క్‌తో మాట్లాడి ఆహ్వానించే ప్రయత్నం చేస్తా


కాంగ్రెస్‌లోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్ఛం అందిస్తున్న 
ఎమ్మెల్యే కాలె యాదయ్య. చిత్రంలో సంపత్‌కుమార్, దీపా దాస్‌మున్షీ

చేవెళ్ల భారాస ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీలు యాదయ్యను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఇప్పటికే భారాస నుంచి ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, సంజయ్‌కుమార్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు యాదయ్య చేరికతో ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. కాంగ్రెస్‌లో ఇంకా ఎంతమంది చేరబోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా.. చేరినప్పుడు మీకే చెబుతామని బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని