Phone tapping: ట్యాపింగ్‌ కేసులో... మరో మలుపు!

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో తాను హైదరాబాద్‌ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం.

Updated : 05 Jul 2024 06:53 IST

ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్‌రావు 
బ్లూకార్నర్‌ నోటీసు జారీ అనుమానమే 
ఆయన పాస్‌పోర్టు జప్తులోనూ సవాళ్లెన్నో

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో తాను హైదరాబాద్‌ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు అరెస్టయిన నలుగురు అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడంలేదు. ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణం. 

సాంకేతిక కారణాలతోనే జాప్యం 

తామే అనుమతి ఇచ్చుకొని, తామే ట్యాపింగ్‌ చేయడం ఎక్కడా ఉండదు. ఫోన్‌ ట్యాపింగ్‌ కోసమే అప్పటి ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు ఆ అధికారాన్ని కట్టబెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొచ్చంటూ ముక్తాయింపు ఇచ్చినా అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభాకర్‌రావు ముఠా చెలరేగింది. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు... ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగొస్తేనే ముందుకు సాగుతుంది. కేసు నమోదవడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు. అయితే... తాను పారిపోలేదని, జూన్‌ 26నాటికి తిరిగొచ్చి, దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయించారు. గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు... ఆయనపై బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. విదేశాల్లో ఉన్న నిందితుల ఆచూకీని ఇంటర్‌పోల్‌ ద్వారా కనుక్కునేందుకు బ్లూకార్నర్‌ నోటీసు ఇస్తుంటారు. ఈ మేరకు ఇంటర్‌పోల్‌ విభాగానికి లేఖ రాయాలని సీఐడీ ద్వారా స్థానిక పోలీసులు సీబీఐని కోరారు. ఆ విన్నపం ఇంకా సీబీఐ వద్దే పెండింగ్‌లో ఉంది. ఇది ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే కేసు నమోదవకముందే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లారు. అంతకుముందు కూడా చికిత్స కోసమే పలుమార్లు వెళ్లివచ్చారు. ఈ కారణంగానే ఆయన పరారీలో ఉన్నట్లు నిర్ధారించడం అంత సులభం కాదు. అలాంటప్పుడు ఇంటర్‌పోల్‌ లాంటి సంస్థ బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేయడం అనుమానమే. 

రెండో ప్రత్యామ్నాయమూ కష్టమే... 

దర్యాప్తు అధికారులు మరో ప్రయత్నంగా... ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును జప్తు చేయాలని రీజనల్‌ పాస్‌పోర్టు అధికారికి లేఖ రాశారు. భారత పాస్‌పోర్టు కలిగిన ఎవరైనా నిందితుడు విదేశాలకు వెళ్లి, తిరిగి రాకుంటే దాన్ని రద్దు చేయించొచ్చు. అప్పుడు నిందితుడు విదేశాల్లో అక్రమంగా ఉంటున్నట్లే లెక్క. విషయాన్ని మన దర్యాప్తు సంస్థలు సంబంధిత దేశానికి చేరవేసిన వెంటనే... నిందితుడిని వెనక్కి పంపించేస్తారు. ఎర్రచందనం స్మగ్లర్‌ ఎర్ర గంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు. ప్రభాకర్‌రావు విషయంలో ఇలా చేయడం సులభం కాదని తెలుస్తోంది. తాను పారిపోలేదని, చికిత్స కోసమే అమెరికాలో ఉన్నానని అధికారులకు సమాచారం ఇస్తూనే ఉన్నానని వాదిస్తే పాస్‌పోర్డు రద్దుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు. ప్రభాకర్‌రావు ఇప్పట్లో తిరిగొచ్చే అవకాశం కనిపించంలేదు. విదేశాల్లో ఉన్న మరో నిందితుడు శ్రవణ్‌రావు కూడా ఇప్పట్లో తిరిగొచ్చేలా లేరు. ఫలితంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు డోలాయమానంలో పడింది.


క్రియా హెల్త్‌కేర్‌ కేసులో రాధాకిషన్‌రావుకు రిమాండ్‌

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సంబంధించిన షేర్ల బదలాయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును పీటీ(ప్రిజనర్‌ ట్రాన్సిట్‌) వారెంట్‌పై గురువారం జూబ్లీహిల్స్‌ పోలీసులు 17వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపర్చారు. రాధాకిషన్‌రావు ప్రస్తుతం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 2011లో ఎన్‌ఆర్‌ఐ వేణుమాధవ్‌ క్రియా పేరుతో హెల్త్‌కేర్‌ సంస్థను ప్రారంభించారు. తనను కిడ్నాప్‌ చేసి.. రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ కార్యాలయంలో బలవంతంగా క్రియా హెల్త్‌కేర్‌ షేర్లు బదలాయించుకోవడంతోపాటు యాజమాన్య బదలాయింపునకు పాల్పడినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు గత ఏప్రిల్‌లో వేణుమాధవ్‌ ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని