Medigadda barrage: ఏడో బ్లాక్‌ సమస్యలపై అప్రమత్తం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద పెరుగుతుండడంతో ఏడో బ్లాక్‌లో మళ్లీ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. తాత్కాలిక మరమ్మతు పనుల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తినట్లు తెలిసింది.

Published : 05 Jul 2024 03:50 IST

20వ పియర్‌ కిందిభాగంలో కొట్టుకుపోయిన ఇసుక, మట్టి
రింగ్‌బండ్‌ తొలగింపు పనులు వేగవంతం

బ్యారేజీ ఎగువ ప్రాంతంలో రింగ్‌బండ్‌ తొలగింపు పనులు

మహదేవపూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద పెరుగుతుండడంతో ఏడో బ్లాక్‌లో మళ్లీ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. తాత్కాలిక మరమ్మతు పనుల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తినట్లు తెలిసింది. ప్రధానంగా దెబ్బతిన్న 20వ పియర్, ఆ ప్రదేశం కింది భాగంలో ఇసుక, మట్టి, గ్రౌటింగ్‌ కొంతమేర కొట్టుకుపోయినట్లు సమాచారం. ఆ ప్రదేశంలో ముందుగా నీటి ఊటలు, లీకేజీ ఏర్పడంతో ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రవాహం మరింత పెరిగితే ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రింగ్‌బండ్‌ తొలగింపు పనులను వేగవంతం చేశారు. సమస్య ఏర్పడిన ప్రదేశం నుంచి ప్రవాహం సాగుతుండడంతో  ఏం జరిగిందనే దానిపై స్పష్టత రావడం లేదని తెలుస్తోంది. ఇంజినీరింగ్‌ అధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి పలుమార్లు బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అధికారులు మాత్రం ఎలాంటి సమస్యా తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మేడిగడ్డకు ఎగువ నుంచి 16,650 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.


నేడు నగరానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ రాక

రేపటి నుంచి కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ 

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ కోల్‌కతా నుంచి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ రానున్నారు. శనివారం నుంచి విచారణ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఏప్రిల్‌లో విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు విచారణ చేపట్టారు. విచారణకు హాజరైన వారు సమర్పించిన అఫిడవిట్లలోని అంశాలపై శనివారం నుంచి ప్రత్యక్షంగా (క్రాస్‌ ఎగ్జామినేషన్‌) విచారించే అవకాశాలు ఉన్నాయి. ఒకరోజు హైదరాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో బహిరంగ విచారణ సైతం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కమిషన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరమైతే గత ప్రభుత్వంలోని బాధ్యులకు నోటీసులు జారీ చేస్తామని కమిషన్‌ గత నెలలో విచారణ సందర్భంగా వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 19వ తేదీ వరకు విచారణ షెడ్యూల్‌ ఉన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని