TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీలో 3,035 కొలువులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది.

Published : 03 Jul 2024 05:33 IST

భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం
అత్యధికంగా 2 వేల డ్రైవర్‌ పోస్టులు
కొత్త రక్తంతో సంస్థ బలోపేతం: మంత్రి పొన్నం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు అన్నింటికీ ఆమోదం తెలిపింది. మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు. భర్తీ చేసే కొలువుల్లో మూడింట రెండొంతులు (2 వేలు) డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్‌ విభాగంలో 743 కొలువులున్నాయి. 

పుష్కరకాలం తర్వాత నియామకాలు

ఆర్టీసీలో చివరిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత 12 ఏళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది. ఏటా పెద్దసంఖ్యలో సిబ్బంది పదవీ విరమణలతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అదనపు బస్సుల కోసం ఖాళీల భర్తీ అవసరం మరింత పెరిగింది. వీటి భర్తీతో ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ కొద్ది నెలల క్రితం లెక్కలు కట్టింది. కారుణ్య నియామకాల్లో.. కండక్టర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో, ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. 

ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికే భారీ నోటిఫికేషన్‌: పొన్నం

టీజీఎస్‌ఆర్టీసీని కొత్త రక్తంతో బలోపేతం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 3,035 పోస్టుల భర్తీకి అనుమతివ్వడంపై  సీఎం రేవంత్‌రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ ఆవిర్భవించాక ఆర్టీసీలో గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ప్రజారవాణా వ్యవస్థకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీచేస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల మేరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. వాటికి అనుగుణంగా నియామకాలు చేపడుతున్నాం’ అని పొన్నం వివరించారు. త్వరితగతిన నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని