Power Plants: 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది.

Published : 01 Jul 2024 03:52 IST

బీటీపీఎస్‌లో పిడుగుపాటుతో 270 మె.వా...
కేటీపీఎస్‌లో బాయిలర్‌ట్యూబ్‌ లీకుతో 800 మె.వా. ఉత్పత్తికి విఘాతం
వార్షిక మరమ్మతులతో మరో  250 మె.వా. ఉత్పత్తి నిలుపుదల

పిడుగుపాటుతో దగ్ధమైన జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

పాల్వంచ, మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు ప్రధాన విద్యుత్తు కేంద్రాల్లో ఏకంగా 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఇందులో 1070 మె.వా. ఉత్పత్తికి పిడుగుపాటు, బాయిలర్‌ ట్యూబ్‌ లీకు కారణం కాగా.. వార్షిక మరమ్మతులతో మరో 250 మె.వా. ఉత్పత్తి 15 రోజులుగా నిలిచిపోయింది. రాష్ట్రంలోని జెన్కో గ్రిడ్‌కు థర్మల్‌ విద్యుత్కేంద్రాల ద్వారా రోజుకు 4,042 మెగావాట్ల విద్యుత్తు సరఫరా అవుతోంది. ప్రస్తుతం 1,320 మెగావాట్ల ఉత్పత్తికి విఘాతం ఏర్పడడంతో రాష్ట్ర గ్రిడ్‌కు జరిగే సరఫరాలో భారీగా లోటు ఏర్పడింది. అయితే వ్యవసాయ విద్యుత్తు డిమాండ్‌ ఇంకా మొదలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తకపోవచ్చని జెన్కో యాజమాన్యం భావిస్తోంది.

మణుగూరులోని భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం (బీటీపీఎస్‌)లో 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లు కలిపి 1080 యూనిట్ల ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. మొదటి యూనిట్‌లోని జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బుష్‌లపై శనివారం రాత్రి 7.26 గంటలకు పిడుగుపడింది. వాటిల్లోని ఆయిల్‌ కారణంగా యూనిట్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో యూనిట్‌ను షట్‌డౌన్‌ చేశారు. ఈ యూనిట్‌లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు మరో రెండు నెలలు పట్టొచ్చని అంచనా. పిడుగుపాటుతో బీటీపీఎస్‌కు సుమారు రూ.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు జెన్కో డైరెక్టర్‌ (థర్మల్‌) లక్ష్మయ్య వెల్లడించారు. ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు సమీప చిమ్నీ, కూలింగ్‌ టవర్ల వద్ద పిడుగుపాటును నిరోధించే వ్యవస్థలు ఉన్నా ప్రమాదం జరగడంతో.. వాటి సామర్థ్యంపై విచారణ చేపట్టారు. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) సహకారంతో జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయనున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ లోపల 80 కిలో లీటర్ల ఆయిల్‌ ఉంటుంది. దానికి మంటలు అంటుకుని ఉంటే యూనిట్‌ మొత్తానికి ప్రమాదం ఏర్పడి ఉండేదని భావిస్తున్నారు. 

కేటీపీఎస్‌లో... పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఏడో దశ కర్మాగారంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బాయిలర్‌ ట్యూబ్‌ లీకైంది. దీంతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తికి విఘాతం ఏర్పడింది. మరమ్మతులకు అయిదు రోజులు పట్టొచ్చని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ఇక్కడి అయిదో దశ యూనిట్‌ (ఉత్పత్తి సామర్థ్యం 250 మెగావాట్లు)లో   రూ.10 కోట్ల వ్యయంతో జూన్‌ 15 నుంచి వార్షిక మరమ్మతులు మొదలయ్యాయి. జులై నెలాఖరులోగా ప్లాంట్‌లో ఉత్పత్తిని పునరుద్ధరించనున్నారు. 

ఉప ముఖ్యమంత్రి భట్టి సమీక్ష

బీటీపీఎస్‌లోని మొదటి యూనిట్‌ పిడుగుపాటు కారణంగా షట్‌డౌన్‌ కావడంపై ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలో సమీక్షించారు. ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని