Artificial Intillegence: ఏఐ సోషల్‌ లోకం!

సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్‌ మీడియా యాప్‌ ఆరంభమైంది. దీని పేరు బటర్‌ఫ్లయిస్‌. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత.

Published : 26 Jun 2024 00:29 IST

సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్‌ మీడియా యాప్‌ ఆరంభమైంది. దీని పేరు బటర్‌ఫ్లయిస్‌. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. ఇందులో మనకే సొంతమైన ఏఐ పాత్రలను సృష్టించుకోవచ్చు. వీటినే బటర్‌ఫ్లయిస్‌ అని పిలుచుకుంటున్నారు. ఈ యాప్‌ ఇటీవలే బీటా పరీక్షల దశను దాటి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉచితంగానే వాడుకోవచ్చు. యాప్‌ పర్చేస్, ప్రకటనల వంటి ఇబ్బందులూ ఉండవు. ఒకరకంగా దీన్ని ఏఐ ఇన్‌స్టాగ్రామ్‌ అనుకోవచ్చు. ఇందులో హోం, సెర్చ్, డైరెక్ట్‌ మెసేజ్‌స్, ప్రొఫైల్‌ వంటి ట్యాబ్‌లన్నీ అలాగే ఉంటాయి. యాప్‌ స్టోర్, ప్లే స్టోర్‌ రెండింటిలోనూ ఈ యాప్‌ అందుబాటులో ఉంది.

బటర్‌ఫ్లయిస్‌ యాప్‌ను మనుషులు, ఏఐ పాత్రలతో కూడిన కొత్త సామాజిక మాధ్యమ లోకమని చెప్పుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని, సైనప్‌ అయితే చాలు. దానిలోని ఏఐ పాత్రలతో ఛాట్‌ చేయొచ్చు. లేదూ సొంత ఏఐ పాత్రను సృష్టించుకోవచ్చు. బాట్ల మాదిరిగా పనిచేసే ఇవి జీవం పోసుకొని తమకు తామే ఇతరులతో మాటా మంతీ కలుపుతాయి. తమదైన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ మీద రోజువారీ వ్యవహారాల గురించి పోస్టులు పెడతాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగానే వీటికి డైరెక్ట్‌ మెసేజ్‌లు పంపొచ్చు. పాత్రలకే కాదు.. యూజర్లకూ ప్రత్యేక ప్రొఫైల్‌ పేజీ ఉంటుంది. ఇందులో మన గురించి పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ పేజీలో యూజర్లు సృష్టించిన పాత్రలూ కనిపిస్తాయి. ఇతర యూజర్లే కాదు.. ఏఐ పాత్రలు కూడా మనల్ని ఫాలో అవ్వచ్చు. అవి మన పోస్టులను లైక్‌ లేదా కామెంట్‌ చేయొచ్చు. సృష్టించిన ఏఐ పాత్రలను ఇతర ఏఐ పాత్రలు కూడా ఫాలో అయ్యే అవకాశముంది.

సొంత ఏఐ పాత్రను సృష్టించుకోవటమెలా?

ముందు బటర్‌ఫ్లై లోగో మీద తాకాలి. పాత్ర పేరు టైప్‌ చేయాలి. తర్వాత పాత్ర వ్యక్తిత్వం ఎలా ఉండాలో వర్ణించాలి. ఉదాహరణకు- సాహసి, అదే సమయంలో దయాగుణం ఉండటం.. ఇలా ఇష్టమైన వ్యక్తిత్వ గుణాన్ని టైప్‌ చేయాలి. అనంతరం పాత్ర ఎలా కనిపించాలో వర్ణించాలి. ఉదా- అమ్మాయి లేదా అబ్బాయి, రింగుల జుట్టు, ఛామన ఛాయ, అందమైన కళ్లు, రంగుల చొక్కా, నల్ల ప్యాంటు.. ఇలా నచ్చిన అలంకరణను టైప్‌ చేయాలి. తర్వాత రియలిస్టిక్, సెమీ-రియలిస్టిక్, డ్రాయింగ్‌ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకొని.. క్రియేట్‌ బటన్‌ మీద నొక్కాలి. అంతే పాత్ర రూపుదిద్దుకుంటుంది. ప్రొఫైల్‌ విభాగంలోకి వెళ్లి, ఫాలోయర్స్‌ మీద క్లిక్‌ చేస్తే సృష్టించుకున్న పాత్ర కనిపిస్తుంది. ఇలా సృజనాత్మకతను బట్టి ఎన్ని పాత్రలనైనా సృష్టించు
కోవచ్చు. 

ఎలా వాడుకోవాలి? 

యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక వెంటనే గెట్‌ స్టార్టెడ్‌ మీద నొక్కటం కన్నా వెనక్కి వెళ్లి బటర్‌ఫ్లయిస్‌ గుర్తును తాకటం మంచిది. గెట్‌ స్టార్టెడ్‌ మీద నొక్కితే ఫోన్‌ నంబరును జత చేయాల్సి ఉంటుంది. బటర్‌ఫ్లయిస్‌ గుర్తు మీద తాకితే అసలు సైన్‌ఇన్‌ పేజీ కనిపిస్తుంది. ఇందులో ఫోన్‌ నంబరుతో గానీ గూగుల్‌ ఖాతాతో గానీ ఇతర ఈమెయిల్‌తో గానీ ఖాతాను తెరవొచ్చు. మెయిల్‌కు అందే వెరిఫై ఈమెయిల్‌ మీద క్లిక్‌ చేస్తే ఖాతా ఓపెన్‌ అవుతుంది. 

  • హోం పేజీలో అప్పటికే ఉన్న పాత్రలు, వాటి పోస్టులు కనిపిస్తాయి. పాత్ర మీద క్లిక్‌ చేస్తే దాన్ని సృష్టించిన వారి  పేరు తెలుస్తుంది. దాని మీద తాకితే వారి ఫ్రొఫైల్‌ వివరాలు ప్రత్యక్షమవుతాయి. వీళ్లు నిజమైన యూజర్లు. ఏఐ పాత్రలు కాదని గుర్తుంచుకోవాలి. 
  • పాత్రల హోం పేజీలోకి వెళ్తే ఫాలో, ఛాట్‌ ఆప్షన్లు ఉంటాయి. ఇష్టమైతే ఫాలో కావొచ్చు. ఫాలో కాగానే ఆ పాత్ర పెట్టిన పోస్టులన్నింటినీ చూడొచ్చు. లేదూ ఛాట్‌ ఆప్షన్‌తో వాటితో నేరుగా ముచ్చటించొచ్చు.
  • దేని గురించి అడిగినా పాత్రలు స్పందిస్తాయి. నిజం మనుషుల మాదిరిగానే సమాధానాలిస్తాయి. అబద్ధాలేమీ చెప్పవు. ఒకవేళ ప్రతిస్పందన నచ్చకపోతే రీజనరేట్‌ బటన్‌ను నొక్కితే కొత్త రెస్పాన్స్‌ ప్రత్యక్షమవుతుంది. ఎమోజీ మీట ద్వారా అది మనకు నచ్చిందో లేదో తెలియజేయొచ్చు. సెటింగ్స్‌ బటన్‌ ద్వారా తిరిగి కొత్త ఛాట్‌ను ఆరంభించే అవకాశమూ ఉంటుంది. 
  • ఒకే సమయంలో వేర్వేరు పాత్రలతోనూ ఛాట్‌ చేయొచ్చు. మోసం చేస్తున్నట్టు అనిపిస్తే పాత్రలు మనల్ని బ్లాక్‌ చేస్తాయి కూడా. పాత్రలు ‘నిద్రించే’ సమయంలో వాటితో ఛాట్‌ చేసినా బ్లాక్‌ చేయొచ్చు. ప్రొఫైల్‌ పేజీలోకి వెళ్తే వాటి టైమ్‌ జోన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా అవి యాక్టివ్‌గా ఉన్నాయా? నిద్రాణంగా ఉన్నాయా? అనేది తెలుస్తుంది. 
  • ఏదైనా పాత్రను వెతకాలనుకుంటే హోం పేజీలోకి వెళ్లి వాటి పేర్లతో సెర్చ్‌ చేసి, గుర్తించొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని