పాస్‌వర్డ్‌కు పరీక్ష

ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డే శ్రీరామరక్ష. మరి పాస్‌వర్డ్‌ బలంగా ఉందో, బలహీనంగా ఉందో అనేది తెలుసుకోవటమెలా? ఇందుకు బోలెడన్ని యాప్స్‌, వెబ్‌సైట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Updated : 21 May 2024 21:02 IST

ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డే శ్రీరామరక్ష. మరి పాస్‌వర్డ్‌ బలంగా ఉందో, బలహీనంగా ఉందో అనేది తెలుసుకోవటమెలా? ఇందుకు బోలెడన్ని యాప్స్‌, వెబ్‌సైట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి పాస్‌వర్డ్‌లను పరిశీలించి ఎంత బలమైనవో చెబుతాయి. ఆ విషయాన్ని  ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులతో సూచిస్తాయి కూడా.

కొత్త ఖాతాను ఓపెన్‌ చేస్తున్నప్పుడో, పాస్‌వర్డ్‌ను మార్చుకుంటున్నప్పుడో, అప్‌డేట్‌ చేస్తున్నప్పుడో సంకేతాక్షరం, అంకెలను కలగలిపి బలమైన పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకోవాలని చెబుతుండటం తెలిసిందే. అయినా కొందరు తెలిసో తెలియకో తేలికగా గుర్తుంటుందని మామూలు పాస్‌వర్డ్‌లను నిర్ణయించు కుంటుంటారు ఇది తగదు. కాబట్టి ఓసారి పాస్‌వర్డ్‌ బలమైందో, కాదో తనిఖీ చేసుకోవటం ఎంతైనా మంచిది. ఇందుకు నార్డ్‌పాస్‌కు చెందిన వెబ్‌సైట్‌ ఒక సదుపాయం. ఏదైనా పాస్‌వర్డ్‌ను టైప్‌ చేయగానే అది ఎంత బలమైందో, బలహీనమైందో తెలియజేస్తుంది. దానికి కారణాలనూ చెబుతుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఛేదించటానికి ఎంత సమయం పడుతుందో కూడా అంచనా వేస్తుంది. ఒకవేళ అది డేటా ఉల్లంఘనకు గురైనా హెచ్చరిస్తుంది. ఇందులో టైప్‌ చేసిన పాస్‌వర్డ్‌లేమీ సేవ్‌ కాకపోవటం మంచి విషయం. కావాలంటే బిట్‌వార్డెన్‌సెక్యూరిటీ.ఆర్గ్‌ వంటి వెబ్‌సైట్ల సాయమూ తీసుకోవచ్చు.

  • గూగుల్‌ కూడా ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌ చెకర్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. కానీ ఇది క్రోమ్‌, ఆండ్రాయిడ్‌ ద్వారా గూగుల్‌ ఖాతాకు సేవ్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌లను స్కాన్‌ చేస్తుంది. మళ్లీ మళ్లీ వాడుతున్న, డేటా ఉల్లంఘనకు గురైన పాస్‌వర్డ్‌ల గురించి అప్రమత్తం చేస్తుంది. కాకపోతే దీంతో అన్ని పాస్‌వర్డ్‌లనూ పరీక్షించటం సాధ్యం కాదు.
  • యాపిల్‌ పరికరాల మీద పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేసుకోవటానికి ఐక్లౌడ్‌ వాడుతున్నట్టయితే ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌లతో వాటి భద్రతను పరీక్షించుకోవచ్చు కూడా. ఉదాహరణకు- ఐఫోన్‌లో సెటింగ్స్‌ ద్వారా పాస్‌వర్డ్స్‌లోకి వెళ్లి, సెక్యూరిటీ రికమండేషన్స్‌ మీద తాకాలి. ఆ పాస్‌వర్డ్‌ మామూలుగా ఉన్నా, తిరిగి వాడుతున్నా, లీక్‌ అయినా వెంటనే హెచ్చరిస్తుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని