PM Modi - Olympics: 2036 ఒలింపిక్స్‌ బిడ్డింగ్‌ సక్సెస్‌కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేసి వస్తారని ప్రధాని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. అథ్లెట్లతో సంభాషించిన వీడియోను ఆయన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

Published : 05 Jul 2024 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్‌ 2036 పోటీలకు ఆతిథ్య ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్‌ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లో పారిస్ వేదికగా జరగబోయే ఒలింపిక్స్‌ 2024 కోసం ఎంపికైన అథ్లెట్లతో ప్రధాని గురువారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే భారత్‌ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత క్రీడల పండుగను నిర్వహించేందుకు విలువైన సలహాలు ఇవ్వాలని కోరారు. అథ్లెట్లతో మోదీ భేటీకి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

‘‘మనం ఒలింపిక్స్‌ను సమర్థవంతంగా నిర్వహించగలమనే నమ్మకం ఉంది. దీని వల్ల దేశ క్రీడా రంగం మరింత విస్తరించేందుకు అవకాశం కలుగుతుంది. అందుకోసం మౌలికవసతుల కల్పన కొనసాగుతోంది. మీరు (అథ్లెట్లను) ఈవెంట్లతో బిజీగా ఉన్నప్పుడు కాకుండా.. విరామం సమయంలో క్రీడా రంగం కోసం ఏదైనా చేయమని కోరుతున్నా. సదుపాయాలకు సంబంధించి మీ పరిశీలనకు వచ్చిన విషయాలను పంచుకోండి. మీరిచ్చే సూచనలు, సలహాలు 2036 బిడ్డింగ్‌కు ఉపయోగపడతాయి. మరింత ఉత్తమంగా ఎలా సిద్ధం కావచ్చనే దానిపై మాకూ అవగాహన వస్తుంది’’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

చుర్మా రుచి చూపిస్తా: ప్రధానికి నీరజ్‌ హామీ

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో నీరజ్‌ చోప్రా మాట్లాడాడు. ఈ సందర్భంగా ప్రధానికి ‘చుర్మా’ (మిఠాయి) తినిపిస్తానని ప్రామిస్ చేశాడు. ‘‘ట్రైనింగ్ బాగా సాగుతోంది. గాయాల బారిన పడకుండా ఉండాలని మరీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం లేదు. ఇటీవల ఫిన్‌ల్యాండ్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించా. అథ్లెట్లు నిర్భయంగా ఆడేయండి. నేను బంగారం పతకం సాధించిన గేమ్స్‌లో అలానే ఆడా. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈసారి ఒలింపిక్స్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. మెరుగైన ఫలితం సాధించి మళ్లీ మిమ్మల్ని (ప్రధానిని) కలుస్తాం. అప్పుడు మీకు ‘చుర్మా’ రుచి చూపిస్తాను’’ అని నీరజ్‌ చోప్రా తెలిపాడు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ.. ‘మీ అమ్మగారి చేతితో తయారు చేసే చుర్మా అంటే నాకు ఇష్టం’ అని అన్నారు. 

ఇది నాకు మూడో ఒలింపిక్స్‌: సింధు

‘‘కొత్తగా బరిలోకి దిగుతున్న క్రీడాకారులకు ఆల్‌ది బెస్ట్. దేశం తరఫున ఆడటం ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. అయితే, దీనిని ఒక టోర్నీలా భావించి వంద శాతం కష్టపడితే సత్ఫలితాలు సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మూడో ఒలింపిక్స్‌ ఆడబోతున్నా. అయితే, ఈ గేమ్స్‌లో ఆడటం అంత సులువేం కాదు’’ అని తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. ‘‘ఇది డెబ్యూ ఒలింపిక్స్‌. ఎంతో ఉత్సాహంగా ఉన్నా. అదే సమయంలో నా దృష్టంతా గేమ్‌పైనే ఉంది. అభిమానుల అంచనాలను అందుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తా’’ అని తెలంగాణ బాక్సర్‌ నిఖత్ జరీన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు