Team India: స్వదేశానికి టీమ్ఇండియా.. ప్రధాని మోదీతో ప్లేయర్ల భేటీ ఎప్పుడంటే?

టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమ్ఇండియా (Team India) మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనుంది. స్వదేశానికి వచ్చిన కాసేపటికే భారత ఆటగాళ్లు ప్రధాని మోదీని కలవనున్నారు. 

Published : 03 Jul 2024 17:22 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో యావత్ భారతావని ఆనందంతో ఉప్పొంగింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో క్రికెట్‌ అభిమానులు బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. వరల్డ్ కప్‌ ట్రోఫీతో భారత జట్టు (Team India) సొంత గడ్డపై అడుగుపెట్టగానే ఘన స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భారత్ బృందం స్వదేశానికి రావాల్సి ఉండగా బెరిల్‌ హరికేన్‌ కారణంగా కొన్ని రోజులుగా బార్బడోస్‌లోనే ఉండిపోయింది. అక్కడ పరిస్థితులు మెరుగపడటంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని బార్బడోస్‌కు పంపింది. ఈ స్పెషల్ చార్టెడ్‌ ప్లైట్‌లో రోహిత్‌శర్మ సేన, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబసభ్యులు బార్బడోస్‌ నుంచి బుధవారం బయల్దేరారు. 

ఈ ప్రత్యేక విమానం గురువారం ఉదయం 6 గంటలకు దిల్లీలో ల్యాండ్‌కానుంది. ఉదయం 9.30 గంటలకు భారత ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నివాసానికి బయల్దేరుతారు. మోదీతో సమావేశంలో టీమ్ఇండియా ప్లేయర్స్‌ ప్రపంచ కప్‌ జర్నీ విషయాలను పంచుకోనున్నారు. అనంతరం భారత ఆటగాళ్లు మోదీతో  కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబయికి వెళ్తుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి బయల్దేరనుంది. వాంఖడేకు సమీపంలో రెండు కిలోమీటర్ల మేర నిర్వహించే ఓపెన్ బస్‌ పరేడ్‌లో భారత ఆటగాళ్లు వరల్డ్ కప్‌ ట్రోఫీతో సందడి చేయనున్నారు. అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించే ఓ చిన్న కార్యక్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్‌ ట్రోఫీని బీసీసీఐ కార్యదర్శి జై షాకు అందజేస్తారు. సాయంత్రం భారత ఆటగాళ్లు తమ ఇళ్లకు పయనవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని