T20 World Cup: అఫ్గాన్‌ సెమీస్‌కు రిజర్వ్‌ డే.. భారత్‌కు మాత్రం లేదు.. ఎందుకలా..?

పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్‌ దశలో పలు నిబంధనలు మారాయి. ఒక జట్టుకు రిజర్వ్‌ డే లభించగా.. మరో జట్టుకు దక్కలేదు. అదే సమయంలో ఫలితం తేల్చే ఓవర్ల సంఖ్య కూడా మారింది. ఇవి టీమ్‌ ఇండియాకు లాభమా.. నష్టమా..?

Updated : 26 Jun 2024 11:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈసారి పొట్టి ప్రపంచకప్‌ (T20 World Cup)లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొదటి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉండగా.. రెండో దానికి ఆ సౌకర్యం లేదు. దీంతో అదేంటీ అందరికీ ఒక రూల్‌.. టీమ్‌ ఇండియాకు మరో రూలా అని ఫ్యాన్స్‌ చర్చించుకొంటున్నారు. ఈ నిబంధన వల్ల టీమ్‌ ఇండియా ఫైనల్స్‌కు చేరే అవకాశాలు ఏమైనా దెబ్బతింటాయేమోననే అందోళన కూడా వారిలో మెండుగా ఉంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకొందాం..!

తొలి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉందా..?

అఫ్గానిస్థాన్‌-దక్షిణాఫ్రికా (AFG vs SA) మధ్య ట్రినిడాడ్‌ వేదికగా గురువారం ఉదయం 6 గంటలకు తొలి సెమీఫైనల్స్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు మర్నాడును రిజర్వుడేగా ఉంచారు. వర్షం కారణంగా షెడ్యూల్‌ సమయంలో మ్యాచ్‌ పూర్తికాకపోతే అదనంగా మరో 60 నిమిషాలు కేటాయించారు. రిజర్వ్‌డే రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించారు. కానీ, ఇక్కడ ఒక్కసారి టాస్‌ వేసి.. జట్టు సభ్యుల వివరాలను ఇచ్చిపుచ్చుకొన్నాక వాటిల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. రిజర్వ్‌డే వాటికి కొనసాగింపుగానే ఉంటుంది. మరోసారి టాస్‌ వేయరు.

వాస్తవానికి షెడ్యూల్‌ రోజునే అవసరమైతే ఓవర్లు కుదించి అయినా మ్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వర్షం కారణంగా అదికూడా సాధ్యంకాని పక్షంలో రిజర్వ్‌డేకు (Reserve Day) తీసుకెళతారు. అలాంటి సందర్భంలో రిజర్వ్‌డేలో కుదించిన ఓవర్ల ప్రకారం ఆడతారా..? లేదా పూర్తిగా 20 ఓవర్లకు ఆడతారా..? అనేది పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు. 

షెడ్యూల్డ్‌ రోజునే ఓవర్ల కుదింపు నిర్ణయం జరిగాక ఒక్క బంతి కూడా పడకుండా వర్షం మొదలై మ్యాచ్‌ మర్నాటికి వాయిదా పడితే మాత్రం కుదించిన ఓవర్లు అమలు కావు. సాధారణంగా 20 ఓవర్లు పూర్తయ్యేవరకు ఆడాల్సి ఉంటుంది. అదే ఒక బంతి ఆడినా.. మర్నాడు కుదించిన ఓవర్లకే ఆడాల్సి ఉంటుంది. రిజర్వ్‌డే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుంది. 

  • ఉదాహరణకు తొలి ఇన్నింగ్స్‌లో ఓ జట్టు 10 ఓవర్లు ఆడాక వర్షం పడటంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారనుకొందాం. కానీ, నిర్ణయం వెలువడిన తర్వాత ఒక్క బంతి కూడా మ్యాచ్‌ జరగకుండా తిరిగి వాన మొదలై రిజర్వ్‌ డేకు వెళ్లిందనుకొందాం. అప్పుడు మ్యాచ్‌ 20 ఓవర్ల వరకు ఆడాల్సి ఉంటుంది. ఆ రోజు మళ్లీ  వర్షం పడితే ఫ్రెష్‌గా అప్పుడు ఓవర్ల కుదింపు నిర్ణయం తీసుకొంటారు. 
  • నిర్ణీత రోజున మ్యాచ్‌ మొదలై 10 ఓవర్ల తర్వాత వర్షం పడిన సందర్భంలో 15 ఓవర్లకు కుదించారనుకొందాం. ఆ తర్వాత మైదానంలో ఒక ఓవర్‌ ఆడాక వాన పడి మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లినప్పుడు కుదించిన 15 ఓవర్లకు ఆడాల్సిందే. మళ్లీ జల్లులు మొదలైతే అంపైర్లు చర్చించి మరింతగా కుదించొచ్చు. ఈ రోజు అదనపు సమయం 190 నిమిషాలు ఉంటుంది. 
  • వాస్తవానికి ఫలితం తేల్చాలంటే సెమీస్‌ దశలో రెండు జట్లూ కనీసం 10 ఓవర్లు ఆడగలగాలి. అంతేగానీ.. గ్రూప్‌, సూపర్‌-8 దశలో వలే 5 ఓవర్లు ఆడితే చాలదు. అసలు వర్షం కారణంగా మ్యాచ్‌ జరగకపోతే అధిక ర్యాంక్‌ జట్టు ఫైనల్స్‌కు వెళుతుంది. ఈ రకంగా చూస్తే దక్షిణాఫ్రికా తుదిపోరుకు వెళ్లే అవకాశాలున్నాయి. అదే గ్రూప్‌-1లో అయితే భారత్‌కు ఆ అవకాశాలున్నాయి. ఫైనల్స్ కూడా వర్షం కారణంగా రద్దైతే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 

భారత్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు నిబంధనలు ఎందుకు మారాయి..?

భారత్‌-ఇంగ్లాండ్‌ (IND vs ENG) రెండో సెమీస్‌లో గురువారమే రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గయానా వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. కానీ, ఒకే రోజు ఏకంగా 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. రిజర్వ్‌ డే ఎందుకు లేదన్న అంశంపై ఐసీసీ (ICC) అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ప్లేయింగ్‌ కండీషన్లను టోర్నమెంట్‌కు కొన్ని నెలల ముందే ప్రకటించారు.

భారత్‌ (Team India) ఒకవేళ సెమీస్‌కు చేరితే.. సూపర్‌-8 స్టాండింగ్స్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు గయానాలో ఆడుతుందని అప్పట్లోనే తేల్చారు. ఎందుకంటే పగలు (విండీస్‌ కాలమానం ప్రకారం) జరిగే ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు సౌకర్యవంతంగా వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకొన్నారు. తొలి సెమీస్‌ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి వేళ జరుగుతుంది. గయానాలో భారత సంతతి ప్రజలు చాలా ఎక్కువ.  

మనకు రిజర్వ్‌డే లేకపోవడానికి సమయమే ప్రధాన కారణం. తొలి సెమీస్‌ దక్షిణాఫ్రికా-అఫ్గాన్‌ మధ్య స్థానిక కాలమానం ప్రకారం జూన్‌ 26 రాత్రి 8.30కి మొదలవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం జూన్‌ 27 ఉదయం 6 గంటలు. ఇక రెండో సెమీస్‌ ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య లోకల్‌ టైమ్‌ ప్రకారం జూన్‌ 27 ఉదయం 10.30కి మొదలవుతుంది. ఇక దీనిని మన కాలమానంలో చూస్తే జూన్‌ 27 రాత్రి 8 గంటలు. 

విండీస్‌ టైమ్‌ ప్రకారం జూన్‌ 29వ తేదీ ఉదయం 10.30 ఫైనల్స్ మొదలవుతాయి. అంటే రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే కేటాయిస్తే.. ఫైనల్స్‌ ఆడటానికి అందులోని విజేత జట్టుకు కనీసం 24 గంటల సమయం కూడా ఉండదన్నమాట. ఈ కారణంతోనే రిజర్వ్‌డేను వీరికి ఎత్తేశారు. ఒకేరోజు అదనంగా 250 నిమిషాలు కేటాయించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని