Rohith Sharma: రోహిత్‌ వారసుడెవరు?

ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్‌ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్‌.. మళ్లీ ఇప్పుడు భారత్‌ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్‌బై చెప్పాడు రోహిత్‌ శర్మ.

Updated : 03 Jul 2024 07:27 IST

ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్‌ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్‌.. మళ్లీ ఇప్పుడు భారత్‌ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్‌బై చెప్పాడు రోహిత్‌ శర్మ. దీంతో ఈ ఫార్మాట్లో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై పడింది. మరి రోహిత్‌ వారసుడెవరవుతారన్నది ఆసక్తికరం.

ఈనాడు క్రీడావిభాగం

రోహిత్‌తో పాటు కోహ్లి, జడేజా సైతం టీ20లకు టాటా చెప్పగా.. వారి స్థానాల్లోకి వచ్చేందుకు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అయతే ఆటగాళ్లను భర్తీ చేయడం వేరు, ఒక కెప్టెన్‌ స్థానాన్ని భర్తీ చేయడం వేరు. నిజానికి 20 నెలల కిందట 2022 టీ20 ప్రపంచకప్‌ ముగిసినపుడే టీ20ల్లో రోహిత్, కోహ్లిల ప్రస్థానం ముగిసిందనుకున్నారు. దీంతో రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్య టీ20 సారథి అయ్యాడు. ఇక టీ20 జట్టు కెప్టెన్‌ విషయంలో పునరాలోచనలేమీ ఉండవనే అనుకున్నారు. కానీ త్రుటిలో వన్డే ప్రపంచకప్‌ కోల్పోయాక భారత అభిమానుల దృష్టి పొట్టి కప్పు మీద పడడం.. వాళ్లిద్దరూ ఉత్తమ ఫామ్‌లో ఉండడం.. మరోవైపు హార్దిక్‌ ఫిట్‌నెస్, ఫామ్‌ లేమితో ఇబ్బంది పడడంతో కథ మారిపోయింది. తిరిగి రోహిత్‌ టీ20 జట్టు పగ్గాలందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ ముంగిట హార్దిక్‌ అసలు జట్టులో ఉంటాడా అన్న చర్చ జరిగింది. కానీ అతను ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చాడు. టోర్నీలో బ్యాటుతో, బంతితో రాణించాడు. దీంతో ఇప్పుడు మళ్లీ టీ20 జట్టు కెప్టెన్‌ బాధ్యతలకు ప్రధాన పోటీదారుగా మారాడు. అలా అని బీసీసీఐ, సెలక్టర్లు ప్రత్యామ్నాయాల వైపు చూడరనడానికి లేదు.

వారి నుంచి పోటీ..: టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌కు ముగ్గురి నుంచి పోటీ ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్, ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌లపైనా సెలక్టర్లు ఓ కన్నేస్తున్నట్లు సమాచారం. బుమ్రా గత ఏడాది ఐర్లాండ్‌ పర్యటనలో జట్టును నడిపించాడు. టీ20ల్లో అతడి కెప్టెన్సీ బాగానే సాగింది. అతను వివాద రహితుడు. ఒత్తిడిలో ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతాడు. కాకపోతే బౌలర్లను కెప్టెన్‌గా నియమించే సంప్రదాయం భారత క్రికెట్లో లేదు. పైగా మూడు ఫార్మాట్లలో భారత్‌కు ఎంతో కీలకమైన బుమ్రాపై కెప్టెన్సీ ఒత్తిడి పడితే తన ప్రదర్శనపై, ఫిట్‌నెస్‌పై ఆ ప్రభావం పడుతుందేమో అన్న ఆందోళన ఉంది. సూర్యకుమార్‌ విషయానికొస్తే.. అతడికి కెప్టెన్‌గా అనుభవం లేదు. తనది విధ్వంసక బ్యాటింగ్‌ శైలి. కెప్టెన్‌ అయితే బాధ్యతాయుతంగా ఆడే క్రమంలో శైలి మార్చుకోవాల్సి ఉంటుంది. సూర్యకు 33 ఏళ్లు వచ్చేసిన నేపథ్యంలో భవిష్యత్‌ దిశగా ఆలోచిస్తే వయసు ప్రతికూలమవుతుంది. ఇక మూడో ప్రత్యామ్నాయం.. శుభ్‌మన్‌ గిల్‌. ఒక దశలో మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించిన గిల్‌.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌ కాగలడన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ గత ఏడాదిలో కొంచెం నిలకడ తప్పాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ అయినప్పటికీ.. జట్టును సరిగా నడిపించలేకపోయాడు. అయితే జింబాబ్వే పర్యటనతో టీ20 జట్టుకు అతడే సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక్కడ తనదైన ముద్ర వేయగలిగితే హార్దిక్‌కు గట్టి పోటీదారు అవుతాడు. హార్దిక్‌.. ఫిట్‌నెస్, ఫామ్‌ సమస్యలను ప్రస్తుతం అధిగమించినట్లే కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి జట్టు రోహిత్‌ స్థానంలో కెప్టెన్‌ కావడం వల్ల అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న అతను.. ఇప్పుడు కుదురుకున్నాడు. ప్రపంచకప్‌ విజయంలో కీలక పాత్ర పోషించి మళ్లీ వారి అభిమానాన్నీ సంపాదించాడు. ఈ సీజన్‌కు ముందు ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు గుజరాత్‌ జట్టును గొప్పగా నడిపించిన అనుభవం అతడికి ప్లస్‌. కాబట్టి అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుని చూస్తే హార్దిక్‌ టీ20 జట్టు కెప్టెన్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని