Wasim Akram: మొత్తం మార్చాలి..

భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ పాకిస్థాన్‌ జట్టుపై ఆ జట్టు మాజీలు విరుచుకుపడుతున్నారు. భారత్‌ చేతిలో ఓడిపోవడం కంటే.. ఓడిన తీరే బాధ కలిగించిందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు.

Published : 11 Jun 2024 03:15 IST

పాక్‌ జట్టుపై వసీమ్‌ అక్రమ్‌

కరాచి: భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డ పాకిస్థాన్‌ జట్టుపై ఆ జట్టు మాజీలు విరుచుకుపడుతున్నారు. భారత్‌ చేతిలో ఓడిపోవడం కంటే.. ఓడిన తీరే బాధ కలిగించిందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. ‘‘పాక్‌ క్రికెట్‌కు ఇదో బాధాకరమైన రోజు. ఆటలో గెలుపు ఓటములు సహజమే. కానీ ఆడిన తీరు ముఖ్యం. జట్టులో అసలేమవుతోందో పీసీబీనే చెప్పాలి. ఇప్పటిదాకా జరిగింది చాలు. పాక్‌ జట్టులో కనీసం ఆరేడుగురు ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అప్పుడూ ఓటమే ఎదురైనా కొత్తవాళ్లతో ఓడిపోయాం అనైనా అనుకోవచ్చు. కనీసం వాళ్లతోనైనా పోరాటం చేసే జట్టును తయారు చేసుకోవచ్చు’’ అని అక్రమ్‌ సూచించాడు.

శస్త్ర చికిత్స చేయాల్సిందే... పీసీబీ: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో ఓడిన పాకిస్థాన్‌ జట్టుకు పెద్ద శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని పీసీబీ అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వి అన్నాడు. ‘‘విజయాల బాట పట్టాలంటే పాక్‌ జట్టుకు పెద్ద శస్త్ర చికిత్స అవసరం. అమెరికా చేతిలో కంగుతిన్న బాధ నుంచి తేరుకోముందే.. భారత్‌ చేతిలో పరాభవం ఎదురైంది. ఎందుకు పాక్‌ సరిగా ఆడట్లేదని అంతా అడుగుతున్నారు. ఈ విషయంపై చర్చ జరగాలి’’ అని నఖ్వి తెలిపాడు. 

ఇమాద్‌ కావాలనే చేశాడు: భారత్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో ఇమాద్‌ వసీమ్‌ కావాలనే బంతులను వృథా చేశాడని పాక్‌ మాజీ కెప్టెన్‌ సలీమ్‌ మాలిక్‌ ఆరోపించాడు. ‘‘ఇమాద్‌ ఇన్నింగ్స్‌ చూడండి.. అతడు 23 బంతులు ఆడి 15 పరుగులే చేశాడు. కావాలనే బంతులు వృథా చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఛేదన చాలా క్లిష్టంగా మారింది’’ అని మాలిక్‌ అన్నాడు. ‘‘సారథి అంటే అందరిని ఐక్యంగా ఉంచాలి. లేకపోతే జట్టు వాతావరణం దెబ్బ తింటుంది. అజామ్‌తో మిగిలిన ఆటగాళ్లకు పొసగనట్లు కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌ ముగిశాక ఈ విషయంపై మరింత బహిరంగంగా మాట్లాడతా’’ అని అఫ్రిది అన్నాడు. పాక్‌ ఓటమిపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని