IND vs PAK: దాయాదుల పోరు.. భారత్ 60%.. పాకిస్థాన్ 40%!

దాయాదుల పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌ సూపర్-8కి చేరువగా వస్తుంది. పాక్‌ ఓడితే మాత్రం తదుపరి దశకు చేరుకోవడం కష్టమే.

Updated : 09 Jun 2024 17:18 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో ఇవాళ రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) టీమ్‌ఇండియా - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ జరగనుంది. ఇందుకు వేదిక న్యూయార్క్‌లోని నాసౌవ్‌ మైదానం. నిలకడలేని బౌన్స్‌తో పిచ్‌ వార్తల్లో నిలిచింది. క్రికెటర్లు గాయాలపాలు కావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం కూడా కష్టమని ఇప్పటికే తేలిపోయింది. ఈ క్రమంలో దాయాదుల పోరుపై పాక్‌ మాజీ స్టార్ వకార్‌ యూనిస్, వసీమ్‌ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘నా మనస్సు మాత్రం పాక్‌ గెలుస్తుందని చెబుతుంది. కానీ, ఇప్పటి వరకు టోర్నీలో జరిగిన మ్యాచులను చూస్తే భారత్‌ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి. న్యూయార్క్‌ పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంది. తప్పకుండా మంచి పోటీ ఉంటుందని భావిస్తున్నా. బౌన్స్‌ను అంచనా వేయగలిగిన జట్టే విజేతగా నిలుస్తుంది’’ అని వకార్‌ వ్యాఖ్యానించాడు. 

భారత్‌కు 60 శాతం అవకాశం: వసీమ్

‘‘ఇప్పుడు భారత్‌ ఫామ్‌ను చూస్తే పాక్‌పై విజయం సాధించే అవకాశాలు 60 శాతం ఉన్నాయి. అత్యుత్తమ జట్టే తప్పకుండా గెలుస్తుంది. భారత్‌కు 60.. పాక్‌కు 40 శాతం అవకాశం ఉందని గట్టిగా చెబుతున్నా. ఇది టీ20 మ్యాచ్‌. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితం మారే అవకాశాలు ఉంటాయి’’ అని వసీమ్‌ అక్రమ్‌ తెలిపాడు. 

పాక్‌పై సూర్య భారీ స్కోరు చేస్తేనే..: కమ్రన్ అక్మల్

‘‘ఇప్పుడు ఐసీసీ ర్యాంకుల్లో సూర్యకుమార్‌ యాదవ్ టాప్. కానీ, ఆటపరంగా విరాట్ కోహ్లీనే బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆ తర్వాతే సూర్య. ఇప్పటి వరకు పాక్‌పై అతడు నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడలేదు. రోహిత్, విరాట్ తమ సత్తా ఏంటో నిరూపించారు. ఇప్పుడు సూర్య వంతు. టాప్‌ ర్యాంక్‌ తనదే అని నిరూపించుకోవాలంటే సూర్య భారీ ఇన్నింగ్స్‌తో అలరించాలి’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని