Virat - MS Dhoni: ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్‌ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్

భారత క్రికెట్‌ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్‌ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్. 

Published : 18 May 2024 16:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా వెల్లడించడంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) ముందుంటారు. ప్రస్తుత ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేస్తున్న విరాట్ కోహ్లీని (Virat Kohli) ఓవైపు అభినందిస్తూనే.. స్ట్రైక్‌రేట్‌ విషయంలో విమర్శలు గుప్పించడం గమనార్హం. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఇంకాస్త దూకుడుగా పరుగులు చేస్తే బాగుటుందనే సలహాలు ఇచ్చాడు. తాజాగా విరాట్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) కీలక పాత్ర పోషించాడని గావస్కర్ వ్యాఖ్యానించాడు. బెంగళూరు - చెన్నై మ్యాచ్‌ నేపథ్యంలో ఓ క్రీడా ఛానెల్‌తో సన్నీ మాట్లాడాడు. 

‘‘కోహ్లీ కెరీర్‌ ఆరంభం గొప్పగా లేదు. ఒక అడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉండేది. ఆ సమయంలో కోహ్లీని ఎంఎస్ ధోనీ ముందుండి నడిపించాడు. ఇప్పుడు మనం చూస్తున్న కోహ్లీ ఆటతీరు వెనక ధోనీ కీలక పాత్ర ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ 13 మ్యాచుల్లో 661 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం అతడి వద్దే ఈ క్యాప్‌ ఉంది. ఈ ఎడిషన్‌ తొలి అర్ధ భాగంలో కోహ్లీ స్ట్రైక్‌రేట్‌ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మాత్రం 155 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌పై కోహ్లీ..

ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌పై ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసిన రోహిత్ శర్మకు (Rohit Sharma) మద్దతుగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ‘‘ఎంటర్‌టైన్‌ అనేది ముఖ్యమే కానీ.. సమతూకం చాలా అవసరం. రోహిత్ చెప్పినదానికి నేనూ అంగీకరిస్తా. ప్రతీ జట్టులోనూ బుమ్రా వంటి పేసర్ లేదా రషీద్ ఖాన్‌లాంటి మిస్టర్‌ స్పిన్నర్ ఉండటం కష్టం. ప్రతీ బౌలర్‌ కూడా తమ ఓవర్‌లో సిక్స్‌ లేదా ఫోర్ ఇవ్వాలని కోరుకోడు. అదనంగా బ్యాటర్‌ ఉన్నాడని తెలిస్తే.. పవర్‌ ప్లేలో 200+ స్ట్రైక్‌రేట్‌తో ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ బౌలర్లకు పెద్దగా లాభం చేకూరడం లేదు. అందుకే, జట్టు బ్యాలెన్స్‌ తప్పినట్లు అనిపిస్తోంది’’ అని కోహ్లీ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని