Rohit - Kohli: టీ20 వరల్డ్ కప్‌.. రోహిత్‌తో ఐకానిక్‌ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ పట్టుకుని రోహిత్‌ శర్మతో కలిసి ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) వెల్లడించాడు.

Published : 02 Jul 2024 10:49 IST

ఇంటర్నెట్ డెస్క్: 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్‌ మరోసారి పొట్టి కప్‌ను అందుకోవడంతో ఇటు ఆటగాళ్లు, అటు ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించిన అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma), స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా చాలా ఎమోషనల్‌ అయ్యారు. అనంతరం రోహిత్, కోహ్లీ జాతీయజెండాను తమ భుజాలపై కప్పుకుని టీ20 ప్రపంచ కప్‌ ట్రోఫీతో ఫొటోలు దిగారు. రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాను భుజాలపైకి ఎత్తుకోగా.. విరాట్ వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకొని వారితో ఫొటోలు దిగాడు. ఈ చిత్రాలు రోహిత్, కోహ్లీల కెరీర్‌లోనేకాక భారత క్రికెట్‌ చరిత్రలోనూ మధుర జ్ఞాపకంగా ఉంటాయి.  

రోహిత్‌తో ఈ ఐకానిక్‌ ఫొటో దిగడానికి గల కారణాన్ని విరాట్ కోహ్లీ బయటపెట్టాడు. వరల్డ్ కప్‌తో ఇద్దరం కలిసి ఫొటో దిగుదామని రోహిత్‌ను తానే కోరినట్లు కోహ్లీ చెప్పాడు. ‘‘టీ20 వరల్డ్ కప్‌ గెలవడం నాకే కాదు.. రోహిత్‌కు కూడా చాలా ప్రత్యేకం. అతని కుటుంబం ఇక్కడ ఉంది. సమైరా (రోహిత్ కుమార్తె) అతని భుజాలపై ఉంది. ఈ గెలుపు వెనక అతడి కృషి ఎంతో ఉంది. కాసేపు ట్రోఫీని పట్టుకోమని అతని (రోహిత్‌)కి చెప్పా. మా ఇద్దరి ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. అందుకే కలిసి ఫొటో దిగాం’’ అని కోహ్లీ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు. 

రోహిత్, కోహ్లీ ఒకేసారి జట్టులో ఉండి వరల్డ్ కప్ సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రోహిత్ శర్మ భారత్ 2007 టీ20 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పటికి కోహ్లీ టీ20ల్లోకి అరంగేట్రం చేయలేదు. భారత్‌ 2011 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అప్పుడు రోహిత్‌కు జట్టులో చోటు దక్కలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని