Virat Kohli: విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్స్‌ రికార్డు.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు!

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఖాతాలో నాలుగో ఐసీసీ టైటిల్ చేరింది. 

Updated : 30 Jun 2024 16:32 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2024 టైటిల్‌ను టీమ్‌ఇండియా (Team India) కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్ ఐసీసీ టైటిల్‌ను అందుకోవడం ఇదే మొదటిసారి. ఈ ప్రపంచ కప్‌ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2024 పొట్టి కప్‌ను అందుకోవడం ద్వారా కోహ్లీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

నాలుగు ఐసీసీ టైటిల్స్‌ అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్‌ (2008), వన్డే ప్రపంచ కప్‌ (2011), ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచ కప్‌ (2024) కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. టీమ్‌ఇండియాకు సుదీర్ఘకాలంపాటు కెప్టెన్‌గా ఉన్న మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)కి ఈ రికార్డు సాధ్యం కాలేదు. అతడు మూడు ఐసీసీ టైటిల్స్‌తో తన కెరీర్‌ను ముగించాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే ప్రపంచ కప్‌, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను ధోనీ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ (Yuvaraj Singh) నాలుగు ఐసీసీ టైటిల్స్ సాధించాడు. యువీ.. అండర్-19 వరల్డ్ కప్‌ (2000), 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీ (భారత్, శ్రీలంక సంయుక్త విజేత), 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లను అందుకున్నాడు. 

అదొక్కటే లోటు 

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాలుగు టైటిల్స్‌ సాధించిన కోహ్లీ.. టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ టైటిల్‌) మాత్రం ఇప్పటివరకు సాధించలేదు. భారత్‌ 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ఆడిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. కానీ, ఈ రెండుసార్లు టీమ్‌ఇండియాకు నిరాశే ఎదురైంది. కోహ్లీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను కూడా అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది (2025) డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని