Virat kohli: నిజమే.. ఫైనల్‌ కోసం దాచుకున్నాడు

ప్రపంచకప్‌ లాంటి టోర్నీల్లో విరాట్‌ కోహ్లిది తిరుగులేని రికార్డు. మిగతా జట్టంతా విఫలమైనా అతను నిలుస్తాడని పేరు. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో కూడా అతను అద్బుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌ నుంచి గొప్ప ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో అదరగొడతాడని అనుకున్నారు అభిమానులు.

Updated : 30 Jun 2024 08:26 IST

ప్రపంచకప్‌ లాంటి టోర్నీల్లో విరాట్‌ కోహ్లిది తిరుగులేని రికార్డు. మిగతా జట్టంతా విఫలమైనా అతను నిలుస్తాడని పేరు. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో కూడా అతను అద్బుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌ నుంచి గొప్ప ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టడంతో ఈ టోర్నీలో అదరగొడతాడని అనుకున్నారు అభిమానులు. కానీ అనూహ్యం.. వరుసగా వైఫల్యాలే. గ్రూప్‌ దశలో 3 మ్యాచ్‌లాడి చేసింది 5 పరుగులే. సూపర్‌-8లోనూ ప్రదర్శన అంతంతమాత్రం. సెమీఫైనల్లో అయినా ఆడతాడనుకుంటే.. అక్కడా నిరాశే. ఫైనల్లో అతడి మీద ఆశలే లేవు. అయితే విరాట్‌ వైఫల్యం గురించి ఈ మ్యాచ్‌ ముంగిట కెప్టెన్‌ రోహిత్‌ను అడిగితే.. ‘‘విరాట్‌ స్థాయి ఏంటో మాకు తెలుసు. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో అతనెలా ఆడతాడో తెలుసు. బహుశా ఫైనల్‌ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో’’ అన్నాడు. కెప్టెన్‌ మాటలను నిజం చేస్తూ కోహ్లి నిజంగానే ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడి.. ఆపై చివర్లో చెలరేగి ఇన్నింగ్స్‌కు మంచి ముగింపునిచ్చాడు విరాట్‌. అర్ధశతకం పూర్తయ్యే వరకు విరాట్‌ వేగంగా ఆడకపోవడం అభిమానులకు కొంత అసహనం తెప్పించి ఉండొచ్చు. కానీ భారత్‌ 34/3తో నిలిచిన దశలో.. ఇంకొక్క వికెట్‌ పడితే జట్టు ఎంత ఇబ్బంది పడేదన్నది ఊహించడం కష్టం. షాట్ల కోసం ప్రయత్నించి వికెట్‌ ఇస్తే ఏమవుతుందో తెలిసే.. కోహ్లి ఆ సాహసం చేయలేదు. ఓ ఎండ్‌లో విరాట్‌ పాతుకుపోయి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం వల్ల అక్షర్‌కు షాట్లు ఆడే అవకాశం దక్కింది. మ్యాచ్‌ చివరి ఓవర్లకు వచ్చాక విరాట్‌ షాట్లకు ప్రయత్నించి విఫలమైనా.. ఆఖర్లో మాత్రం అదరగొట్టాడు. అంతకుముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేశాడు. దీంతో భారత్‌ మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని