Virat-Rohit-Rishabh: అప్పుడు కెమెరా తనవైపే ఉందని కోహ్లీకి తెలియదు: మాజీ క్రికెటర్లు

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్ రిషభ్ పంత్ ఔటైన తీరుపై విరాట్-రోహిత్ మాట్లాడుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

Published : 27 Jun 2024 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఒక సెమీస్‌ ముగియగా.. రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, సూపర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడి క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ-రోహిత్ (Virat Kohli - Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంభాషించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డగౌట్‌కు వచ్చిన పంత్‌తో ఇదే విషయంపై కోహ్లీ చర్చించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఇప్పుడు ఫర్వాలేదు. పెద్ద మ్యాచుల్లో పునరావృతమైతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వరుసగా రెండుసార్లు ఇదే తప్పిదం చేయకూడదు. రోహిత్-విరాట్ మాట్లాడుకుంటూ కనిపించారు. రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) సత్తా ఏంటో వారికి తెలుసు. ఇలా అనవసరంగా వికెట్‌ను సమర్పించడం వారిని నిరాశకు గురి చేసింది’’ అని భారత మాజీ ఆటగాడు పీయూశ్‌ చావ్లా వ్యాఖ్యానించాడు. కామెంటేటర్లు దీప్‌దాస్‌ గుప్తా, సంజయ్‌ మంజ్రేకర్ కూడా ఆ మ్యాచ్‌ సమయంలో ఇలానే స్పందించారు. 

‘‘రోహిత్‌తో విరాట్ మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూశాం. రిషభ్‌ చాలా బాగా ఆడాడు. కానీ, అవసరమైన సమయంలో ఇలాంటి షాట్‌తో పెవిలియన్‌కు చేరాడు. అదే అతడిని నిరుత్సాహానికి గురి చేసింది’’ అని దీప్‌దాస్‌ తెలిపాడు.

‘‘రిషభ్ పంత్‌ ఔటైనప్పుడు విరాట్ రియాక్షన్‌ను గమనించారా? ఆ సమయంలో కెమెరా తనవైపు ఉందని కోహ్లీ అనుకోలేదు. పంత్‌ అలాంటి క్యాచ్‌ ఇచ్చిన వెంటనే స్పందించి తన మొహానికి టవల్‌ అడ్డు పెట్టుకున్నాడు. సగటు క్రికెట్ అభిమాని ఎలా స్పందిస్తాడో.. కోహ్లీ కూడా అలాంటి రియాక్షనే ఇచ్చాడు’’ అని మంజ్రేకర్ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని